Iran: హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలనం.. భూగర్భ 'మిస్సైల్ సిటీ' వీడియో విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి మీదుగా నౌకా రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో ఇరాన్ సైన్యం ఒక సంచలన వీడియోను విడుదల చేసింది. హర్మూజ్ ప్రాంతంలో తాము మోహరించిన సూసైడ్ (కామికాజీ) డ్రోన్ బోట్లు భారీ సంఖ్యలో సిద్ధంగా ఉన్నాయని, అలాగే భూగర్భంలో ఏర్పాటు చేసిన మిస్సైల్ సిటీలో కూడా అనేక ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని ఆ వీడియో ద్వారా తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ ప్రసారం చేసిన ఈ వీడియోలో పొడవాటి భూగర్భ బంకర్‌లో వరుసగా నిల్వ ఉంచిన పెద్దసంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు కనిపించాయి.
Details
పలు రకాల ఆయుధాలను ప్రయోగిస్తున్న దృశ్యాలు
ఒకదాని వెంట మరొకటి అమర్చిన ఈ డ్రోన్ బోట్ల దృశ్యాలు ప్రత్యేకంగా చూపించారు. అదే బంకర్‌లో యాంటీ-షిప్ మిస్సైళ్లు, సముద్రంలో ఉపయోగించే మందుపాతరలు (నేవల్ మైన్స్) కూడా నిల్వ ఉంచినట్లు వీడియోలో కనిపించింది. మరో ఫుటేజీలో పలు రకాల ఆయుధాలను ప్రయోగిస్తున్న దృశ్యాలు కూడా చూపించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించబడింది? ఎక్కడ తీశారు? అనే విషయాలు మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ వీడియో తీసారా? లేక అంతకుముందే రికార్డు చేశారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Details
ఏమిటి నేవల్ డ్రోన్లు?
నేవల్ డ్రోన్లను సాధారణంగా అన్‌మ్యాన్‌డ్ సర్ఫేస్ వెహికల్స్ (USVs) అని పిలుస్తారు. ఇవి చిన్న పరిమాణంలో ఉండే డ్రోన్ బోట్లు. సముద్ర జలాల ఉపరితలంపై లేదా కొద్దిగా నీటి అడుగుభాగంలో ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ డ్రోన్లలో పేలుడు పదార్థాలు అమర్చబడుతాయి. లక్ష్యంగా పెట్టుకున్న శత్రు నౌక లేదా ట్యాంకర్‌ను ఢీకొన్న వెంటనే ఇవి పేలిపోతాయి. ఇటీవల పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో రెండు ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో కూడా ఇరాన్ ఇలాంటి నేవల్ డ్రోన్లనే ఉపయోగించినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లు, ఇతర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ ఈ నేవల్ డ్రోన్ బోట్లను వినియోగిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.