Loading...
Astronomical Events: నవంబర్‌లో ఆకాశంలో అద్భుతాలు.. మూడు ఉల్కాపాతాలు, సూపర్ మూన్ సహా ఏడు ఖగోళ వింతలు!
నవంబర్‌లో ఆకాశంలో అద్భుతాలు.. మూడు ఉల్కాపాతాలు, సూపర్ మూన్ సహా ఏడు ఖగోళ వింతలు!

Astronomical Events: నవంబర్‌లో ఆకాశంలో అద్భుతాలు.. మూడు ఉల్కాపాతాలు, సూపర్ మూన్ సహా ఏడు ఖగోళ వింతలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆకాశ వీక్షకులకు నవంబర్ 2026 ప్రత్యేకమైన నెలగా నిలవనుంది. ఈ నెలలో ఆకాశంలో పలు అద్భుత ఖగోళ సంఘటనలు కనువిందు చేయనున్నాయి. మూడు ఉల్కాపాతాలు, అంగారకుడు-బృహస్పతి గ్రహాల సమీప కలయిక, సూపర్ మూన్ వంటి విశేషాలు చోటుచేసుకోనున్నాయి. అంతేకాకుండా శుక్రుడు ఈ ఏడాదిలోనే అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. సుదూరంలోని యురేనస్ గ్రహం సూర్యుడికి వ్యతిరేక దిశలోకి రానుంది. వీటిలో కొన్ని ఖగోళ సంఘటనలను ఉత్తర, దక్షిణ అర్ధగోళాల్లోని ప్రజలు వీక్షించవచ్చు. మరికొన్ని మాత్రం నిర్దిష్ట ప్రాంతాల్లో మెరుగ్గా కనిపిస్తాయి.

వివరాలు

నవంబర్ 4-5: సదరన్ టారిడ్స్ ఉల్కాపాతం

నవంబర్ 4-5 తేదీల మధ్య రాత్రి సదరన్ టారిడ్స్ ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.

నవంబర్ 5న అమెరికా తూర్పు కాలమానం (EST) ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఇది గరిష్ఠ స్థాయిలో ఉండనుంది.

ఈ ఉల్కాపాతం నెమ్మదిగా కదిలే ఉల్కలకు, అప్పుడప్పుడు ఆకాశంలో ప్రకాశవంతమైన అగ్నిగోళాల్లా కనిపించే ఉల్కలకు ప్రసిద్ధి. అర్ధరాత్రి తర్వాత కాంతి కాలుష్యం తక్కువగా ఉండే చీకటి ప్రదేశాల్లో వీక్షిస్తే మెరుగ్గా కనిపిస్తుంది.

వాతావరణం అనుకూలించి, ఆకాశం స్పష్టంగా ఉంటే గంటకు సుమారు ఐదు ఉల్కలను చూడవచ్చు. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాతో పాటు రెండు అర్ధగోళాల్లోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఉల్కాపాతాన్ని వీక్షించవచ్చు.

వివరాలు

నవంబర్ 11-12: నార్తర్న్ టారిడ్స్ ఉల్కాపాతం

నవంబర్ 11-12 తేదీల మధ్య రాత్రి నార్తర్న్ టారిడ్స్ ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.

నవంబర్ 12న అమెరికా తూర్పు కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:02 గంటలకు దీని గరిష్ఠ సమయం ఉంటుంది.

సదరన్ టారిడ్స్ తరహాలోనే ఈ ఉల్కాపాతం కూడా ప్రకాశవంతమైన అగ్నిగోళాల్లాంటి ఉల్కలకు పేరుగాంచింది.

సాయంత్రం తర్వాత, ముఖ్యంగా రాత్రి వేళల్లో వీక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల నుంచి దీనిని చూడవచ్చు. అయితే ఉత్తర అర్ధగోళంలోని ప్రాంతాల్లో వీక్షణ పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయి.

ADVERTISEMENT

వివరాలు

నవంబర్ 16: అంగారకుడు-బృహస్పతి సమీప కలయిక

నవంబర్ 16న అంగారకుడు (మార్స్), బృహస్పతి (జూపిటర్) గ్రహాలు ఆకాశంలో ఒకదానికొకటి అత్యంత సమీపంలో కనిపించనున్నాయి.

నవంబర్ 15న రాత్రి 11:22 గంటలకు అమెరికా తూర్పు కాలమానం ప్రకారం ఈ రెండు గ్రహాల మధ్య కోణీయ దూరం అత్యల్పంగా ఉండనుంది.

ఆ సమయంలో అవి ఆకాశంలో సుమారు 1.2 డిగ్రీల దూరంలో కనిపిస్తాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు టెలిస్కోప్ తప్పనిసరి కాదు.

కంటితోనే రెండు గ్రహాలను చూడవచ్చు. అయితే మరింత స్పష్టంగా పరిశీలించాలనుకునేవారు బైనాక్యులర్లను ఉపయోగించవచ్చు.

ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల ప్రజలు సూర్యోదయానికి ముందు తూర్పు దిశగా చూస్తే ఈ గ్రహాల సమీప కలయికను వీక్షించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

నవంబర్ 17-18: లియోనిడ్స్ ఉల్కాపాతం

నవంబర్ 17-18 తేదీల మధ్య రాత్రి లియోనిడ్స్ ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.

నవంబర్ 17న అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సాయంత్రం 7:19 గంటలకు ఇది గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. 55P/టెంపెల్-టటిల్ అనే తోకచుక్క వదిలిన శిథిలాల నుంచి ఈ ఉల్కలు ఏర్పడతాయి.

ఇవి సెకనుకు సుమారు 71 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కాంతి కాలుష్యం లేని చీకటి ప్రదేశాల్లో ఆకాశం స్పష్టంగా ఉంటే గంటకు సుమారు 10 నుంచి 15 ఉల్కలను వీక్షించే అవకాశం ఉంటుంది.

ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి తర్వాత నగరాలకు దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఈ ఉల్కాపాతాన్ని చూడవచ్చు.

వివరాలు

నవంబర్ 20: మెర్క్యురీ గ్రేటెస్ట్ వెస్ట్రన్ ఎలాంగేషన్

నవంబర్ 20న బుధ గ్రహం (మెర్క్యురీ) సూర్యుడికి పశ్చిమ దిశలో అత్యధిక కోణీయ దూరానికి చేరుకోనుంది.

అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సాయంత్రం 5:59 గంటలకు ఈ ఖగోళ సంఘటన చోటుచేసుకుంటుంది.

బుధుడు సాధారణంగా సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆకాశంలో గుర్తించడం కష్టంగా ఉంటుంది.

అయితే ఈ సమయంలో సూర్యుడి నుంచి దాని కోణీయ దూరం ఎక్కువగా ఉండటంతో వీక్షించేందుకు మంచి అవకాశం లభిస్తుంది.

ఈ సంఘటనను రెండు అర్ధగోళాల్లోనూ చూడవచ్చు. అయితే ఉత్తర అర్ధగోళంలోని ప్రజలు సూర్యోదయానికి ముందు తూర్పు దిశలో ఉదయపు ఆకాశాన్ని గమనిస్తే బుధ గ్రహాన్ని మరింత అనుకూలంగా వీక్షించవచ్చు.

వివరాలు

నవంబర్ 24: బీవర్ సూపర్ మూన్

నవంబర్ 24న పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో సూపర్ మూన్ కనువిందు చేయనుంది. నవంబర్‌లో వచ్చే పౌర్ణమిని సంప్రదాయంగా 'బీవర్ మూన్' అని పిలుస్తారు.

ఈ ఏడాది ఇది సూపర్ మూన్‌గా కనిపించనుంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చే స్థానాన్ని 'పెరిజీ' అంటారు.

ఈ స్థానానికి సమీపంలో పౌర్ణమి ఏర్పడినప్పుడు దానిని సూపర్ మూన్‌గా పిలుస్తారు.

సాధారణ పౌర్ణమితో పోలిస్తే ఈ సమయంలో చంద్రుడు కొంత పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించవచ్చు.

నవంబర్ 24న స్థానికంగా చంద్రోదయం సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్ మూన్‌ను వీక్షించవచ్చు.

వివరాలు

నవంబర్ 25: యురేనస్ ఆపోజిషన్

నవంబర్ 25న యురేనస్ గ్రహం సూర్యుడికి వ్యతిరేక దిశలోకి రానుంది. అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సాయంత్రం 5:47గంటలకు చోటుచేసుకుంటుంది.

ఈ సమయంలో భూమి సూర్యుడికి, యురేనస్‌కు మధ్య దాదాపుగా ఉండటంతో ఆ గ్రహం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

అలాగే రాత్రిలో ఎక్కువ సమయం ఆకాశంలో వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. సుదూరంలోని ఈ మంచు గ్రహం సుమారు 5.6 మాగ్నిట్యూడ్ ప్రకాశంతో కనిపించనుంది.

చాలా చీకటిగా ఉన్న ఆకాశంలో అద్భుతమైన చూపు ఉన్నవారికి యురేనస్ కంటితో కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. మరింత స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ఉపయోగించడం మంచిది.

ఉత్తరఅమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల ప్రజలు వృషభ రాశి (టారస్)వైపు గమనిస్తే ఈ గ్రహాన్ని వీక్షించవచ్చు.

ADVERTISEMENT