
HBD Balakrishna: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ ఘనత.. 400 రోజులు ఆడిన నటసింహా సినిమా ఏమిటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా పరిచయమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ.
1974లో తన తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'తాతమ్మ కల' సినిమాతో బాలయ్య తన నటజీవితం ప్రారంభించారు.
అప్పటి నుంచే తన తండ్రి నందమూరి తారకరామారావుకు నాటకీయ వారసత్వాన్ని చాటుతూ బాలయ్య కూడా పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో అనేక విభిన్న పాత్రలు పోషించారు.
ఇలా విభిన్న పాత్రల్లో నటించిన అరుదైన నటుడిగా బాలకృష్ణ పేరు తెచ్చుకున్నారు. వందకు పైగా సినిమాల్లో నటించి, నటసింహం అనే బిరుదును సంపాదించారు.
Details
మంగమ్మగారి మనవడు ద్వారా ప్రత్యేక గుర్తింపు
ఏకంగా ఐదు దశాబ్ధాలుగా తెలుగు సినిమా రంగానికి సేవలందిస్తున్న బాలయ్య ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
1960 జూన్ 10న చెన్నైలో ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించిన బాలయ్య, చిన్ననాటి నుంచే తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారు.
తొలిదశలో తండ్రి పక్కన నటించినా, 'మంగమ్మగారి మనవడు' సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అనంతరం సీతారామ కళ్యాణం, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, అఖండ వంటి విజయవంతమైన చిత్రాలతో తన స్థాయిని నిరూపించారు.
విభిన్న శైలుల సినిమాల్లో తన మార్క్ ను బాలయ్య చూపించారు.
Details
జానపద చిత్రాలతో ప్రజలను మెప్పించిన బాలయ్య
"ఆదిత్య 369" వంటి సైన్స్ ఫిక్షన్ చిత్రంతో, 'భైరవద్వీపం' వంటి జానపద చిత్రంతో, శ్రీకృష్ణార్జున విజయం వంటి పౌరాణిక చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు.
ఆధునికత ప్రధానమైన ఈ యుగంలో కూడా "శ్రీరామరాజ్యం", "పాండురంగడు" వంటి చిత్రాల ద్వారా ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా తన నైపుణ్యాన్ని చాటారు.
వెండితెరపై తనకే విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న బాలయ్య, ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
వందరోజుల సినిమాలే అరుదైపోతున్న ఈ కాలంలో, లెజెండ్ చిత్రం ఓ థియేటర్లో 400 రోజులు ఆడేలా చేసిన ఘనత ఆయనది.
అంతే కాదు, ఒకే ఏడాదిలో ఆరు బాక్సాఫీస్ హిట్లు అందుకున్న నటుడిగా అరుదైన రికార్డు సైతం క్రియేట్ చేశారు.
Details
అన్‌స్టాపబుల్ షో ద్వారా రికార్డులు
1986లో ముద్దుల కృష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు వంటి ఆరు చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.
వయసు 60 దాటినా యువ హీరోలకే సవాల్ విసురుతూన్న బాలయ్య, OTTలోనూ *అన్‌స్టాపబుల్* అనే టాక్ షో ద్వారా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.
అతితులతో చక్కటి చర్చలు, నవ్వుల సందడి, ఆత్మీయతతో ఈ షో నిండిపోవడం ద్వారా *ఆహా* ప్లాట్‌ఫారంకు విపరీతమైన రెస్పాన్స్ తెచ్చారు.
దీనివల్ల ఆహాకు రేటింగ్స్, సబ్‌స్క్రైబర్లు పెరగడం విశేషం. సినీ రంగంతో పాటు సేవా రంగంలోనూ బాలకృష్ణ పాత్ర ప్రాశస్త్యం పొందింది.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తూ వేలాది మంది రోగులకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు.
Details
బసవతారకం ఆస్పత్రిలో సేవలు
క్యాన్సర్ పరిశోధన, వైద్య రంగాల్లో ఆసుపత్రిని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన పాత్ర అపూర్వం.
రాజకీయ రంగంలోనూ తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచిన బాలయ్య, హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు.
ప్రజాసేవ పట్ల ఆయన పట్టుదల, నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. బాలకృష్ణ సినీ ప్రయాణంలో ఒడిదుడుకులు లేకపోలేదు.
సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఘన విజయాల తర్వాత విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్కమగాడు, పాండురంగడు, మిత్రుడు వంటి వరుస ఫెయిల్యూర్స్‌తో ఎదురు దెబ్బలు ఎదురయ్యాయి.
Details
ముక్కుసుటిగా మాట్లాడే వ్యక్తిత్వం బాలయ్యది
ఆ సమయంలో ఆయన కెరీర్ ముగిసిందనే ప్రచారం జరిగినా, 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన "సింహా"తో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయన నేరుగా మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారు. కెమెరా ముందు ఒకరలా, వెనక మరోలా ఉండే వారు కాదని చెప్పుకునే బాలయ్య... విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముడినా ఎప్పుడూ నిలబడగలిగారు.
ఫేస్ టు ఫేస్ అనే ఆయన స్వభావం, నిగ్రహం ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న నందమూరి నటసింహానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. "మరిన్ని విజయాలను అందుకోవాలి బాలయ్య, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.