CBFC: నిర్మాతలకు CBFC షాక్.. సినిమా సర్టిఫికేషన్‌పై కొత్త రూల్స్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా విడుదల తేదీ ప్రకటించేశాం కదా అని హడావుడిగా సెన్సార్‌కు దరఖాస్తు చేసుకుంటే ఇక కుదరదు. సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియలో కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (CBFC) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇకపై నిర్మాతలు, దర్శకులు సెన్సార్ కోసం సమర్పించే సినిమా పూర్తి స్థాయిలో సిద్ధమైన తుది వెర్షన్‌లోనే ఉండాలి. గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, డిస్‌క్లెయిమర్లు, సెన్సార్ సర్టిఫికెట్ స్లేట్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా పూర్తిగా ఉండాలి. ఏదైనా అంశం పెండింగ్‌లో ఉంటే దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం కావచ్చు.
Details
సినిమా టైటిల్ కూడా మారే అవకాశం!
నిర్మాతలు ఇకపై సినిమా టైటిల్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే.
సెన్సార్‌కు దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించిన టైటిల్‌నే ఖరారైన పేరుగా భావించకూడదని CBFC స్పష్టం చేసింది.
అవసరమైతే దరఖాస్తు తర్వాత కూడా సినిమా టైటిల్‌ను మార్చే అధికారం తమకు ఉందని తెలిపింది.
అందుకే సర్టిఫికేషన్ పూర్తయ్యే వరకు సినిమా పేరును అధికారికంగా ప్రచారం చేయడంలో తొందరపడవద్దని సూచించింది.
ఈ మార్గదర్శకాలు సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952లోని సెక్షన్ 5B(1), సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) నిబంధనలు, 2024లోని రూల్ 25 ప్రకారం రూపొందించినట్లు బోర్డు పేర్కొంది.
Details
అసంపూర్తి ప్రింట్లు ఇస్తే దరఖాస్తు తిరస్కరణే!
సినిమాలో తాత్కాలిక గ్రాఫిక్స్, ప్లేస్‌హోల్డర్ టైటిల్స్, తాత్కాలిక సంగీతం లేదా అసంపూర్తి సౌండ్ ట్రాక్ ఉంటే వాటిని CBFC అంగీకరించకపోవచ్చు.
దివ్యాంగ ప్రేక్షకులకు అవసరమైన యాక్సెసిబిలిటీ సదుపాయాలు లేకపోయినా దరఖాస్తును నిబంధనలకు విరుద్ధమైనదిగా పరిగణించే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తును వెనక్కి పంపడం, ప్రక్రియను ఆలస్యం చేయడం లేదా పూర్తిగా తిరస్కరించడం జరగవచ్చు. అందువల్ల సెన్సార్‌కు వెళ్లే ముందే ప్రతి విభాగం పనిని పూర్తి చేయడం నిర్మాతలకు తప్పనిసరి కానుంది.