Loading...
Chiranjeevi: 48 ఏళ్ల క్రితం ఇదే రోజు పేరు మార్చుకున్నా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
48 ఏళ్ల క్రితం ఇదే రోజు పేరు మార్చుకున్నా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Chiranjeevi: 48 ఏళ్ల క్రితం ఇదే రోజు పేరు మార్చుకున్నా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు చిరంజీవి తన సినీ ప్రయాణం మొదలై నేటికి 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. 1978 సెప్టెంబర్ 22న తన సినీ ప్రయాణం ప్రారంభమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజు శివశంకర వర ప్రసాద్‌ నుంచి 'చిరంజీవి'గా తాను పెట్టుకున్న పేరు.. నేడు తనకు దక్కిన శాశ్వత గుర్తింపుగా మారిందని పేర్కొన్నారు. '22 సెప్టెంబర్ 1978' తనకు ఎప్పటికీ ప్రత్యేకమైన రోజని చెప్పారు. చిరంజీవి హీరోగా నటించిన 'ప్రాణం ఖరీదు' (Pranam Khareedu) విడుదలై నేటికి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్‌ మీడియాలో తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్‌ చేశారు.

వివరాలు

ఎన్నో విజయాలను చూశాను

'ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. గౌరవాలు, అవార్డులూ అందుకున్నాను.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.

ఆ విజయాలన్నింటికంటే.. అభిమానులు నాపై చూపించే ప్రేమ గొప్పది. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలని చిరంజీవి రాసుకొచ్చారు.

వివరాలు

తొలి చిత్రం 'పునాది రాళ్లు'.. ముందుగా విడుదలైన 'ప్రాణం ఖరీదు'

చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'పునాది రాళ్లు'. అయితే ఆ తర్వాత ఆయన నటించిన 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదలైంది.

కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి 'నరసింహ' అనే పాత్రను పోషించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

'కాకా', 'విశ్వంభర' చిత్రాల్లో నటిస్తున్నారు.

ADVERTISEMENT