LOADING...
Chiranjeevi: గ్రామీణ కథతో చిరంజీవి కొత్త సినిమా.. సుకుమార్ శిష్యుడితో మెగా ప్రాజెక్ట్!
గ్రామీణ కథతో చిరంజీవి కొత్త సినిమా.. సుకుమార్ శిష్యుడితో మెగా ప్రాజెక్ట్!

Chiranjeevi: గ్రామీణ కథతో చిరంజీవి కొత్త సినిమా.. సుకుమార్ శిష్యుడితో మెగా ప్రాజెక్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాల ఎంపికలో కొత్త దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నిర్ణయం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకులతో సినిమాలు లాక్ చేసిన చిరంజీవి, తాజాగా సుకుమార్ శిష్యుడైన దర్శకుడు శ్రీనివాస్ (శ్రీను) చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంతో, బలమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు, రూటెడ్ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీస్తారనే పేరు సుకుమార్ స్కూల్‌కు ఉంది.

Details

పవర్‌ఫుల్ విలేజ్ స్టోరీని సిద్ధం చేసినట్లు టాక్ 

అదే శైలిలో శ్రీనివాస్ కూడా చిరంజీవి కోసం పవర్‌ఫుల్ విలేజ్ స్టోరీని సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక చిరంజీవి వరుసగా సుకుమార్ శిష్యులతో సినిమాలు ఫైనల్ చేయడం ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే 'దసరా' ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఒడేల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ ఖరారైంది. ఇప్పుడు శ్రీనివాస్‌తో మరో సినిమా కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో సుకుమార్ శిష్యులు తమ ప్రత్యేక మేకింగ్ స్టైల్‌తో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. వారి సినిమాల్లో సహజత్వం, గ్రామీణ వాతావరణం ప్రధానంగా కనిపిస్తాయి. అదే స్టైల్ మెగాస్టార్ ఇమేజ్‌కు కలిస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

Details

యువ దర్శకులకు అవకాశాలు

గత కొంతకాలంగా చిరంజీవి తన సినిమా ఎంపికలో మార్పులు చేశారు. కేవలం సీనియర్ దర్శకులతోనే కాకుండా, కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా యువ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తర్వాత, ఈ ఇద్దరు సుకుమార్ శిష్యుల ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశముంది. అయితే ఈ సినిమాలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. శ్రీకాంత్ ఒడేల, శ్రీనివాస్ వంటి ప్రతిభావంతులైన యువ దర్శకులతో మెగాస్టార్ చేయబోయే ఈ ప్రయోగం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement