Chiranjeevi: రక్తాన్ని అమ్ముకుంటున్నాడంటూ విమర్శలు.. చిరంజీవి ఏమన్నారంటే!
ఈ వార్తాకథనం ఏంటి
తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. 'బ్లడ్ బ్యాంకు పెట్టి రక్తాన్ని అమ్ముకుంటున్నాడంటూ చాలా మంది మూర్ఖంగా మాట్లాడారని గుర్తుచేసుకున్నారు. తన సినీ ప్రయాణం ప్రారంభమై 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మెగా యూత్ ఫోర్స్ కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడారు.
వివరాలు
అవే నా కెరీర్‌కు పునాదిరాళ్లు..
మన దగ్గర ఉన్న డబ్బు తరిగిపోతే తిరిగి సంపాదించుకోవచ్చని.. అయితే గడిచిపోయిన సమయం, నిమిషాలు మాత్రం తిరిగి రావని చిరంజీవి అన్నారు.
సమయం ఎంతో విలువైనదని, మనం ఎలా అభివృద్ధి చెందాలో ప్రతి క్షణం ఆలోచించాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
''చిరంజీవిని ప్రేమించడం మాత్రమే కాదు. తను ఎలా పైకొచ్చాడు? ఎలాంటి ఆలోచనా విధానం, ఎలాంటి ఆచరణలు పాటించాడు? అనేది చూడాలి. మనం ఎంచుకున్న రంగంలో క్రమశిక్షణను అలవరుచుకుంటే రాణించవచ్చు.
నా మొదటి సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి వరకూ వచ్చాను. అవన్నీ నా అభివృద్ధికి దోహదపడ్డాయి. అవే నా కెరీర్‌కు పునాదిరాళ్లు'' అని చిరంజీవి పేర్కొన్నారు.
వివరాలు
అభిమానుల శ్రమకు వెలకట్టగలమా?
తన జీవితంలోనూ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చిరంజీవి తెలిపారు.
''ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలి. నాకూ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. 'బ్లడ్ బ్యాంకు పెట్టి రక్తాన్ని అమ్ముకుంటున్నాడు' అని అన్నారు. నాకొచ్చే రెమ్యునరేషన్‌తో పోలిస్తే.. ఎన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మితే ఆ డబ్బుతో సమానమవుతుంది.
ఎంత మూర్ఖంగా మాట్లాడతారు'' అని అన్నారు. తాను ఎక్కడా చేయి చాపకుండా, ఎవరినుంచీ విరాళాలు తీసుకోకుండా కష్టార్జితంతో బ్లడ్ బ్యాంకును నడుపుతున్నానని చిరంజీవి చెప్పారు. ఇందులో తన శ్రమ కంటే అభిమానుల సహకారం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
''దీనికి వెలకట్టగలమా? ఇలాంటివి నేను పట్టించుకోను. మీ జీవితంలో ఎదురయ్యే అవమానాలను పట్టించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్లలేరు.
వివరాలు
అభిమానులు సఖ్యతగా ఉండాలి..
మీ గమ్యాన్ని, లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తూ వెళ్లాలి'' అని అభిమానులకు సూచించారు. తాను అదృష్టాన్ని నమ్మనని, కష్టాన్ని మాత్రమే నమ్ముతానని చిరంజీవి అన్నారు.
ఆ నమ్మకం సడలినప్పుడు అద్దం ముందు నిలబడి 'నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు' అని తనను తాను పొగుడుకుంటూ ఉంటానని చెప్పారు.
నీరసించినప్పుడు తనలో తానే ఉత్సాహాన్ని నింపుకుంటానని తెలిపారు. ''ప్రకృతికి నువ్వు ఏది ఇస్తే.. అది కొన్ని రెట్లు ఇస్తుంది.
దయచేసి సమయం వృథా చేసుకోవద్దు. అభిమానుల మధ్య సఖ్యత ఏర్పరచాలి. హీరోలందరూ బాగున్నారని సందేశం ఇవ్వగలిగితే అభిమానులు కలిసి ఉంటారు.
అలా చేయడం మొదలు పెట్టిందే నేనని అందరికీ తెలుసు. నా తోటి హీరోలందరూ నాతో చాలా బాగుంటారు.
వివరాలు
నేనే సమయ పాలన పాటించకపోతే ఎలా?
చిరంజీవి అభిమానులంటే అందరికీ గర్వకారణంగా ఉండాలని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం 'కాకా' సినిమాలో నటిస్తున్నానని చిరంజీవి వెల్లడించారు.
ఇందులో తన పాత్ర పేరు కదిరి కాళిదాసు అని చెప్పారు. 'కాకా' సినిమా టైటిల్ కేక పెట్టించేలా ఉంటుందని అన్నారు.
సినిమాలో చాలా హెవీ సీన్స్ చేస్తున్నట్లు తెలిపారు. తాను ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్రలేస్తానని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత గంట పాటు కచ్చితంగా వ్యాయామం చేస్తానని తెలిపారు.
మేకప్ వేసుకుని ఉదయం 8 గంటలకు నేరుగా కోకాపేటలోని సెట్స్‌కు చేరుకుంటానని వివరించారు. ''ఇదేమీ గొప్ప కోసం చెప్పడం లేదు. నేను 10 గంటలకు వచ్చినా ఎవరూ అడగరు.
వివరాలు
అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కానీ, నేనే క్రమశిక్షణ పాటించకపోతే.. మిగిలిన టీమ్ ఎలా ఉంటుంది. నా దర్శకులందరూ ఉదయం 7 గంటలకల్లా ఫుల్ టీమ్‌తో రెడీగా ఉంటారు.
అమెరికా అధ్యక్షుడికైనా, ఇక్కడి కార్మికుడికైనా 24 గంటలే. అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి పేర్కొన్నారు.
'మెగా యూత్ ఫోర్స్' మరింత బలోపేతం కావడానికి అభిమానుల సహాయ సహకారాలు కావాలని చిరంజీవి కోరారు. అభిమానులు తన నుంచి ఏమి కోరుకుంటారో అది ఇవ్వడానికి తాను సమాయత్తమవుతానని చెప్పారు.
వారిని వీలైనంత వరకు అలరించడంపైనే దృష్టి పెడతానని తెలిపారు. తమ అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.