Loading...
Garividi Lakshmi Review : గరివిడి లక్ష్మి రివ్యూ.. ఆనంది నటనకు ఫిదా అవ్వాల్సిందేనా?
గరివిడి లక్ష్మి రివ్యూ.. ఆనంది నటనకు ఫిదా అవ్వాల్సిందేనా?

Garividi Lakshmi Review : గరివిడి లక్ష్మి రివ్యూ.. ఆనంది నటనకు ఫిదా అవ్వాల్సిందేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం 'గరివిడి లక్ష్మి'. ఈ సినిమాలో ఆనంది టైటిల్ రోల్‌లో నటించగా.. రాగ్ మయూర్, నరేష్, విజయ్ కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరీ నాయుడు జమ్ము ఈసినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలంగాణ నేపథ్యం ఉన్న చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆనంది స్టేజ్‌పై చేసిన డ్యాన్స్‌తో పాటు, ఆమె పాడిన పద్యాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. దీంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆనంది తన నటనతో ఎంతవరకు మెప్పించింది? ఇప్పుడు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

వివరాలు

గరివిడి లక్ష్మి కథేంటి?

గరివిడి గ్రామానికి చెందిన విజయలక్ష్మి (ఆనంది) చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు దూరంగా పెరుగుతుంది.

చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నప్పటికీ, భర్త చేసిన మోసానికి బలై ఒంటరి మహిళగా మిగిలిపోతుంది.

అయితే అనుకోకుండా ఆమెకు పరిచయమైన బుర్రకథ తన జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది.

అలా బుర్రకథలు చెబుతూ ప్రారంభమైన ఆమె ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆమె జీవితంలో సత్యబాబు (రాగ్ మయూర్) పాత్ర ఏమిటి? విజయలక్ష్మి నుంచి గరివిడి లక్ష్మిగా ఆమె ఎలా మారింది? ఈ ప్రయాణంలో రాంబాబు (నరేష్) పాత్ర ఎలాంటిది?

మరోవైపు ఆమె జీవితకథను సినిమాగా తెరకెక్కించేందుకు హైదరాబాద్‌ నుంచి ఓ దర్శకుడు (అంకిత్ కొయ్య) వస్తాడు.

వివరాలు

సినిమా విశ్లేషణ

మరి అతను గరివిడి లక్ష్మి జీవితాన్ని తెలుసుకుని సినిమాను తెరపైకి తీసుకురాగలిగాడా? ఆమె జీవితంలో ఎదురైన సంఘటనలు ఎలాంటివి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

బయోపిక్‌ సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చే చిత్రం 'మహానటి'.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వెండితెరపై ఆవిష్కరించిన ఈ సినిమా.. ఆ తర్వాత వచ్చిన బయోపిక్‌లకు ఒక దిక్సూచిలా మారింది.

అలాంటి నేపథ్యంలో, ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని గరివిడి అనే గ్రామానికి చెందిన గరివిడి లక్ష్మి జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే సందేహం కలగడం సహజం.

ADVERTISEMENT

వివరాలు

దర్శకుడిగా అద్భుతంగా తెరకెక్కించారు

అయితే, సినిమా ప్రారంభమైన తర్వాత గరివిడి లక్ష్మి పాత్రతో ప్రేక్షకులు కలిసి ప్రయాణించేలా కథను మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్‌లో ఓ యువ దర్శకుడు సినిమా తెరకెక్కించాలనే ఉద్దేశంతో బయలుదేరి, గరివిడి లక్ష్మి జీవితంలో జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా తెలుసుకోవడంతో కథ మొదలవుతుంది.

ఆమె బాల్యం, కౌమారదశ, వివాహం, ఆ తర్వాత ఎదురైన ఇబ్బందులతో ఆ వివాహం విచ్ఛిన్నం కావడం, బుర్రకథ ఆమె జీవితంలోకి ఎలా ప్రవేశించిందనే అంశాలను ఆసక్తికరంగా తెరపై చూపించారు.

ఈ సంఘటనలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించడంలో దర్శకుడు చాలావరకు విజయం సాధించాడు.

ADVERTISEMENT

వివరాలు

ఆసక్తికరంగా కథ

ఫస్ట్ హాఫ్‌లో ప్రధానంగా గరివిడి లక్ష్మి పాత్ర పరిచయం, ఆమె ఎదుగుదల, జీవితంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలపై దృష్టి పెట్టారు.

ఇక సెకండ్ హాఫ్‌ను భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించారు. ఆమె జీవితంలో ఎదురైన అవమానాలు, మోసాలు, కష్టాలను చూపిస్తూనే.. వాటికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో కాకుండా, తనదైన మార్గంలో ముందుకు సాగుతూ ప్రత్యేకమైన జీవితాన్ని గడిపిన తీరును హృద్యంగా ఆవిష్కరించారు.

ఈ సంఘటనలను ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

అక్కడక్కడా కమర్షియల్ అంశాలు కొంత తక్కువగా ఉన్నాయనే భావన కలిగినా, ప్రేక్షకులను కథలో నిమగ్నం చేయడంలో మాత్రం సినిమా పెద్దగా వెనుకబడలేదు.

వివరాలు

ప్రేక్షకుల్లో ఆసక్తి

సాధారణంగా బయోపిక్ అంటే ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన సంఘటనలు, విజయాలు, వైఫల్యాలు, ఎత్తుపల్లాల సమాహారం.

ఈ సినిమాలోనూ గరివిడి లక్ష్మి జీవితంలోని విభిన్న దశలను సమతూకంతో చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

తొలి సినిమానే దర్శకత్వం వహిస్తున్నాడనే భావన పెద్దగా కలగదు. ప్రేక్షకులు గరివిడి లక్ష్మిని తమకు తెలిసిన వ్యక్తిగా, తమ సొంత మనిషిగా భావించేలా ఆమె పాత్రను తీర్చిదిద్దారు.

సావిత్రి వంటి స్టార్ హీరోయిన్ జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకుల్లో ముందే ఆసక్తి, అంచనాలు ఉంటాయి.

కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి తప్ప మిగతా తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి పెద్దగా పరిచయం లేని ఓ మహిళ జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావడం సాహసమే.

వివరాలు

ప్రేక్షకులు భావోద్వేగాలు గురవుతారు

అలాంటి ప్రయత్నం చేయడంలో నిర్మాత కృతి ప్రసాద్ విజయం సాధించారని చెప్పొచ్చు.

ఓ ప్రాంతానికి చెందిన మట్టి కథను అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు నచ్చేలా, మంచి భావోద్వేగాలతో తెరకెక్కించడం అంత సులభం కాదు.

అయితే ఈ విషయంలో కృతి ప్రసాద్ తీసుకున్న శ్రద్ధ సినిమాలో కనిపిస్తుంది. ఎక్కడా ఇబ్బందికరంగా అనిపించే సన్నివేశాలు, అశ్లీలతకు తావులేకుండా కథను ముందుకు తీసుకెళ్లారు.

ఓ మనిషి జీవితంలోని కష్టసుఖాలను, ఎత్తుపల్లాలను ఎంత హృద్యంగా చూపించాలో అంతే హృద్యంగా ఆవిష్కరించడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

ముఖ్యంగా చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు పెట్టించేంతగా హృదయాన్ని తాకుతాయి.

వివరాలు

నటీనటుల పనితీరు

గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రలో ఆమె పూర్తిగా ఒదిగిపోయిన తీరు చూస్తే, నిజంగానే గరివిడి లక్ష్మి జీవితాన్ని కళ్లముందు చూస్తున్నామనే భావన కలుగుతుంది.

ఒకరకంగా చెప్పాలంటే, ఈ పాత్రలో ఆనందిని తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆమె నటించింది.

పాత్రకు అవసరమైన భావోద్వేగాలను చక్కగా పలికిస్తూ తన నటనతో ఆకట్టుకుంది.

రాగ్ మయూర్‌కు కూడా మరో మంచి పాత్ర దక్కింది. నటనకు అవకాశం ఉన్న పాత్రలో ఆయన తనదైన శైలిలో మెప్పించారు.

నరేష్ కీలక పాత్రలో కనిపించడమే కాకుండా, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాశి పాత్రను కూడా బాగా తీర్చిదిద్దారు. ఆమె తన పాత్రకు న్యాయం చేస్తూ చక్కగా నటించారు.

వివరాలు

సాంకేతిక విభాగాలు ఎలా ఉన్నాయి?

శరణ్య ప్రదీప్‌తో పాటు ఇతర కీలక పాత్రల్లో కనిపించిన నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనను కనబరిచారు.

దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము ఆసక్తికరమైన కథను ఎంచుకోవడమే కాకుండా, దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేశారు.

కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరవేయడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సంభాషణల విషయానికి వస్తే, విజయనగరం యాస కొన్ని ప్రాంతాల ప్రేక్షకులకు పూర్తిగా అర్థం కాకపోవచ్చనే భావన కలుగుతుంది.

అయినప్పటికీ, ఎక్కువగా సులభంగా అర్థమయ్యే సంభాషణలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

వివరాలు

నిర్మాణ విలువలు అద్భుతం

కథ మొత్తం విజయనగరం నేపథ్యంతో సాగుతుంది కాబట్టి, ఆ ప్రాంతపు నేటివిటీని నిలబెట్టేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం చాలా సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కథలోని వాతావరణాన్ని, భావోద్వేగాలను కొనసాగించడంలో సహాయపడింది.

సినిమా నిడివి కూడా కథకు తగ్గట్టుగా కుదిరింది. పాటల విషయానికి వస్తే, చరణ్ అర్జున్ అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

ADVERTISEMENT