NTR: 'చరిత్ర భారంగా మారకూడదు'.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
నందమూరి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో ప్రభావం చూపిస్తూ, చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఇంతటి గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ, ఆ భారాన్ని తమ పిల్లలపై రుద్దడం సరైనది కాదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ లకు స్వతంత్రంగా తమ ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని, వారిపై కుటుంబ వారసత్వాన్ని బలవంతంగా రుద్దబోనని స్పష్టం చేశాడు.
చరిత్ర
తనకు కూడా చిన్నప్పుడు ఏ రంగంలోకి వెళ్లాలో నిర్ణయించడానికి స్వేచ్ఛ ఉండేదని, తాను నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్ అని చెప్పారు. తన జీవితంలో ఎన్నో అనుభవాలను పొందానని, ఇదే స్వేచ్ఛను తన పిల్లలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాని పేర్కొన్నారు. వారిపై ఏదైనా నిర్ణయం బలవంతంగా రుద్దడం తనకు ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తన సినీ ప్రయాణాన్ని చిన్న వయస్సులోనే ప్రారంభించాడు. మొదట బాల నటుడిగా 'బ్రహ్మర్షి విశ్వామిత్ర', 'బాల రామాయణం' చిత్రాల్లో నటించిన అతడు, 2001లో 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'స్టూడెంట్ నంబర్ 1'తో తొలి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం, 'దేవర పార్ట్ 1' విజయాన్ని ఎన్టీఆర్ ఆస్వాదిస్తున్నాడు.