Ananya Panday: ఇది భరతనాట్యమా..?.. అనన్య డాన్స్‌పై నెటిజన్ల మండిపాటు!
ఈ వార్తాకథనం ఏంటి
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి 'లైగర్' (Liger) సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి అనన్య పాండే (Ananya Panday), తాజాగా 'చాంద్ మేరా దిల్' (Chand Mera Dil) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్యూర్ కాలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో గతేడాది 'కిల్' (Kill) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో లక్ష్య లాల్వాని హీరోగా నటించాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. కథ మొత్తం హైదరాబాద్ (Hyderabad) నేపథ్యంలో సాగడమే. వివేక్ సోని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫీల్‌గుడ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో విడుదలైంది.
వివరాలు
భరతనాట్యం సీన్‌కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ వైరల్
హైదరాబాద్ లొకేషన్స్, స్థానిక సంస్కృతి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ లభించింది. అయితే ప్రస్తుతం సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ఎక్కువగా, ఇందులోని ఒక డాన్స్ సీక్వెన్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో అనన్య పాండే చేసిన భరతనాట్యం సీన్‌కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సన్నివేశంలో ఆమె సంప్రదాయ భరతనాట్యం దుస్తుల్లో కనిపిస్తూ నృత్యం చేసింది. అయితే ఆమె పర్ఫార్మెన్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆమె ముఖంలో సరైన హావభావాలు కనిపించకపోవడం, డాన్స్ స్టెప్పులు భరతనాట్యం తరహాలో కాకుండా విచిత్రంగా ఉన్నాయంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
వివరాలు
నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో విమర్శలు
"కనీసం బేసిక్స్ కూడా నేర్చుకోకుండా భారతీయ ప్రాచీన నృత్యకళను ఇలా ప్రదర్శించడం సరైంది కాదంటూ పలువురు క్లాసికల్ డాన్సర్లు, నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సీన్ సరిగా తెరకెక్కలేదని విమర్శలు రావడంతో హీరోయిన్ అనన్య పాండేతో పాటు దర్శకుడు వివేక్ సోనిపైనా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. థియేటర్లలో సినిమాకు వచ్చిన స్పందన కంటే, అనన్య పాండే భరతనాట్యం డాన్స్ క్లిప్‌పై జరుగుతున్న ట్రోలింగ్ వల్లే ప్రస్తుతం 'చాంద్ మేరా దిల్' సోషల్ మీడియాలో భారీ అటెన్షన్ సంపాదిస్తోంది.