జబర్దస్త్ ఆర్పీ వ్యాపారానికి సమస్య.. చేపల పులుసు కోసం ఆడిషన్
నెల్లూరు గురించి తెలిసిన వారికి అక్కడి చేపల పులుసు గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందుకే నెల్లూరు పేరు చెబితే నోరూరి పోతుంటుంది. ఐతే నెల్లూరు చేపల పులుసు రుచిని హైదరాబాద్ వాళ్ళకు అందించడానికి జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ, "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు" పేరుతో కర్రీ పాయింట్ ని తెరిచాడు. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కర్రీ పాయింట్ ప్రారంభానికి అతిధులుగా వచ్చారు. సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీ దొరికింది. దాంతో కర్రీ పాయింట్ కి జనాల తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం అదే కిరాక్ ఆర్పీకి సమస్యగా మారింది. దాంతో డిసెంబర్ 30వ తేదీ నుండి హోటల్ మూసుకోవాల్సిన సమస్య వచ్చింది. కిర్రాక్ ఆర్పీ నెల్లూరుకు వెళ్ళాల్సి వచ్చింది.
మనుషులు కావాలి
ఎక్కువ మంది జనాలు కర్రీ పాయింట్ కి వస్తుండడంతో చేపల పులుసు చేసే వాళ్ళు ఎక్కువ మంది కావాల్సి వచ్చింది. అందరికీ సరైన క్వాలిటీ గల చేపల పులుసు అందించాలని, అందుకే నెల్లూరుకు వచ్చానని చెబుతున్నాడు ఆర్పీ. అక్కడ ఎవరైనా చేపల పులుసు చేసే వాళ్ళు దొరికితే వాళ్ళను పనిలోకి తీసుకోవాలని అనుకుంటున్నాడు. వాళ్ళకు పనితో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానని చెబుతున్నాడు. చేపల పులుసు చేసే వాళ్ళకోసం ఆడిషన్ నిర్వహిస్తున్నాడు ఆర్పీ. నెల్లూరు నుండి హైదరాబాద్ వచ్చే వాళ్ళు కావాలని తన మొబైల్ నంబర్ కూడా ఇచ్చాడు. మరి ఈ ఆడిషన్ లో చేపల పులుసు బాగా చేసే వాళ్ళు ఆర్పీకి దొరుకుతారో లేదో చూడాలి.