Kriti Sanon: కృతి సనన్ రాఖీ యాడ్ తొలగింపు.. వివాదంపై జ్యువెలరీ బ్రాండ్ వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
కృతి సనన్ నటించిన రాఖీ యాడ్‌ను ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'జివ' తొలగించింది. ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతోపాటు.. రాజకీయంగానూ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే యాడ్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.
వివరాలు
స్పందించిన జివ..
ఈ వివాదంపై 'జివ' స్పందించింది. ''భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలంటే మాకు ఎంతో గౌరవం.
రక్షాబంధన్ వంటి పండగను కుటుంబ సభ్యులంతా కలిసి జరుపుకోవాలనేదే మా ఉద్దేశం.
ఇందులో భాగంగా పెంపుడు జంతువులపై కూడా ప్రేమను చూపించాలనుకున్నాం.
అయితే మా ప్రకటన వల్ల సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయి.
ఇది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఈ ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి తొలగిస్తున్నాం.
ఈ పండగను మీ అందరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం'' అని 'జివ' ఓ నోట్ విడుదల చేసింది.
వివరాలు
పెంపుడు శునకానికి రాఖీ..
రాఖీ పండగను పురస్కరించుకుని ఇటీవల ఈ యాడ్‌ను విడుదల చేశారు.
ఇందులో కృతి సనన్ వస్త్రధారణతోపాటు.. పెంపుడు శునకానికి రాఖీ కట్టే సన్నివేశంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
సంప్రదాయ భారతీయ పండగ సందర్భంగా ఇలాంటి దుస్తులు ధరించి రాఖీ కట్టడాన్ని తప్పుబడుతూ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు.
సంప్రదాయ భారతీయ పండగకు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియదా అంటూ ప్రశ్నించారు.
మరోవైపు కృతి సనన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు.
దీంతో కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
వ్యవహారం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే 'జివ' యాడ్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.