Page Loader
L2: Empuraan:'ఎల్‌2: ఎంపురాన్‌' వివాదం.. వివాదాస్పద సీన్స్‌ తొలగించనున్న నిర్మాత
'ఎల్‌2: ఎంపురాన్‌' వివాదం.. వివాదాస్పద సీన్స్‌ తొలగించనున్న నిర్మాత

L2: Empuraan:'ఎల్‌2: ఎంపురాన్‌' వివాదం.. వివాదాస్పద సీన్స్‌ తొలగించనున్న నిర్మాత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోహన్‌ లాల్‌ (Mohanlal) నటించిన 'ఎల్‌2: ఎంపురాన్‌' (L2: Empuraan) సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై తాను ఇప్పటికే చిత్ర దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో మాట్లాడానని నిర్మాత గోకులం గోపాలన్‌ తెలిపారు. వివాదాస్పదమైన సన్నివేశాలను తొలగించమని ఆయనను కోరినట్లు వెల్లడించారు. 'ఎంపురాన్‌'లోని ఏదైనా సన్నివేశం లేదా సంభాషణ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే వాటిని వెంటనే మార్చాలని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు చెప్పానని, ఇప్పటికే కొన్ని పదాలను మ్యూట్‌ చేశామన్నారు. అయితే ఇంకా కొన్ని సన్నివేశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాటినీ వీలైతే మార్చమని ఆయనకు సూచించాను. ఒక సినిమా సెన్సార్‌ అనుమతి పొందిందంటే, అందులో ఎలాంటి సమస్యలు లేవనే అర్థమని ఆయన పేర్కొన్నారు.

Details

4వేల థియేటర్లలో ప్రదర్శన

తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, రాజకీయాలను తాను ప్రజలకు సేవ చేసే మార్గంగానే చూస్తానని గోపాలన్‌ స్పష్టం చేశారు. సినిమా విడుదలైన తర్వాత మార్పులు చేయాల్సి వస్తే నిర్మాత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. మా సినిమా ప్రస్తుతం 4000 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మార్పుల కోసం సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఏ నిర్మాత కూడా ఒకరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో సినిమాలు చేయరని, ప్రేక్షకులకు వినోదం పంచడమే లక్ష్యంగా సినిమాలు రూపొందిస్తారని వివరించారు.

Details

వివాదానికి కారణమిదే  

2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను సినిమాలో చూపించారు. అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం, కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఉన్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీరాజ్‌ దర్శకత్వంపై విమర్శలు గుప్పిస్తూ నెట్టింట పలు కామెంట్లు చేస్తున్నారు. సినిమాను నిలిపివేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.