S Janaki: గానకోకిల గుండెల్లో గోదావరి జ్ఞాపకాలు.. రాజమహేంద్రవరంతో ఆత్మీయ బంధం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత నేపథ్య గాయని ఎస్. జానకికి రాజమహేంద్రవరంతో ఎంతో ఆప్యాయమైన అనుబంధం ఉంది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆమె తన సోదరి రాధాదేవి వద్ద రాజమహేంద్రవరంలో చాలా కాలం నివసించారు. స్థానిక ఇన్నీసుపేట ప్రాంతంలో దాదాపు పదకొండేళ్ల పాటు గడిపిన ఆమె, అనంతరం కూడా పలు సందర్భాల్లో ఈ నగరాన్ని సందర్శించారు. చివరిసారిగా 2015లో రాజమహేంద్రవరం వచ్చారు.
వివరాలు
మా కుటుంబంతో ప్రత్యేక అనుబంధం..
జానకిగారు నాకంటే ఆరేళ్లు పెద్దవారు. చిన్నతనంలో నన్ను ఎత్తుకుని ఆడించేవారని పసల శివాజీ అన్నారు. ఎప్పుడూ ఉల్లాసంగా, చురుకుగా ఉండే స్వభావం ఆమెది. మా చదువుల నిమిత్తం మేము చెన్నైకి వెళ్లిన తర్వాత కూడా ఆమె అక్కడికి వచ్చిన ప్రతిసారి మా ఇంట్లోనే బస చేసేవారు. సినీ గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు చెన్నై చేరుకున్న రోజుల్లో, స్వాతంత్ర్య సమరయోధులు అయిన మా తల్లిదండ్రులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి ఆమెకు దాదాపు నెల రోజుల పాటు ఆశ్రయం కల్పించారు. గత ఏడాది హైదరాబాద్‌లోని జానకిగారి నివాసంలో నా సోదరి డాక్టర్ వీణతో కలిసి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నామన్నారు.