Nita Ambani: నీతా అంబానీ మరో ఘనత.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో ఆమె అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ ఈ గుర్తింపును ప్రకటించారు. కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పు నీతా అంబానీ నాయకత్వంలో పనిచేస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 100మిలియన్లకు పైగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చింది. ఇందులో దాదాపు 29మిలియన్ల మంది చిన్నారులు ఉన్నారు. విద్య,ఆరోగ్య సంరక్షణ,మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో సంస్థ విస్తృత స్థాయిలో సేవలు అందిస్తోంది.
వివరాలు
నాయకత్వానికి ఫార్చ్యూన్ ఇండియా గుర్తింపు
ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సోషల్ మీడియా వేదికగా నీతా అంబానీ చిత్రాలను పంచుకుంటూ ఆమెకు అభినందనలు తెలిపింది. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా ఆమె చూపుతున్న దార్శనిక నాయకత్వానికి ఈ గౌరవం నిదర్శనమని పేర్కొంది. సంపదను కూడబెట్టడం కంటే ఎక్కువ మంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే నిజమైన విజయమనే సిద్ధాంతంతో ఆమె ముందుకు సాగుతున్నారని సంస్థ వెల్లడించింది.
వివరాలు
AAPI హ్యుమానిటేరియన్ అవార్డుతో మరో గౌరవం
ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) సంస్థ నీతా అంబానీకి ప్రతిష్టాత్మక AAPI హ్యుమానిటేరియన్ అవార్డును అందజేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడల అభివృద్ధి, భారతీయ సంస్కృతి పరిరక్షణ, సమాజాభివృద్ధి రంగాల్లో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 'టాంపా నగర తాళం చెవి'తో ప్రత్యేక సత్కారం మానవతా సేవల్లో ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ టాంపా నగర మేయర్ జేన్ కాస్టర్ నీతా అంబానీకి కీ టు ది సిటీ' (టాంపా నగర తాళం చెవి)ను బహూకరించారు. అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన పౌర సత్కారాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.
వివరాలు
సామాజిక సేవలో నిరంతర కృషి
సమాజానికి విశేష సేవలు అందించిన వ్యక్తులకు నగరం తరఫున కృతజ్ఞతగా ఈ ప్రతీకాత్మక గౌరవాన్ని ప్రదానం చేస్తారు. నీతా అంబానీ సారథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, క్రీడల ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి కీలక రంగాల్లో అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఆమె నాయకత్వంలో కొనసాగుతున్న ఈ సేవలకు దేశీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా వరుసగా ప్రశంసలు, ప్రతిష్టాత్మక గుర్తింపులు లభిస్తున్నాయి.