Loading...
UAE Asteroid mission: సౌర కుటుంబ రహస్యాల ఛేదనే లక్ష్యం.. ఏడు గ్రహశకలాలపై యూఏఈ పరిశోధనలు
సౌర కుటుంబ రహస్యాల ఛేదనే లక్ష్యం.. ఏడు గ్రహశకలాలపై యూఏఈ పరిశోధనలు

UAE Asteroid mission: సౌర కుటుంబ రహస్యాల ఛేదనే లక్ష్యం.. ఏడు గ్రహశకలాలపై యూఏఈ పరిశోధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌర కుటుంబం ఎలా ఏర్పడింది? గ్రహాల ఆవిర్భావ సమయంలో నీరు, సేంద్రీయ పదార్థాలు ఎలా విస్తరించాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొత్త అంతరిక్ష మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ప్రధాన గ్రహశకలాల వలయంలోని ఆరు గ్రహశకలాలను సమీపం నుంచి పరిశీలించడంతో పాటు, ఏడో లక్ష్యమైన 269 జస్టిటియా ఉపరితలంపై ప్రత్యేక ప్రోబ్‌ను దింపాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రయోగం కోసం అబుదాబికి చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్ (టీఐఐ) అత్యాధునిక ప్రోబ్‌ను అభివృద్ధి చేసింది.

వివరాలు 

5 బిలియన్ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం

ఎమిరేట్స్ మిషన్ టు ది ఆస్టరాయిడ్ బెల్ట్ (ఈఎంఏ)లో భాగంగా 2028 మార్చిలో జపాన్ నుంచి వ్యోమనౌకను ప్రయోగించాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ యాత్రలో వ్యోమనౌక దాదాపు 5 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించనుంది.

సుమారు ఎనిమిదేళ్లపాటు కొనసాగే ఈ మిషన్‌లో శుక్రుడు, భూమి, అంగారక గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని గమ్యస్థానానికి చేరుకునేలా మార్గాన్ని రూపొందించారు.

ప్రణాళిక ప్రకారం, 2036 ప్రారంభంలో 269 జస్టిటియా సమీపంలో ప్రోబ్‌ను ప్రధాన వ్యోమనౌక నుంచి వేరు చేసి, దాని ఉపరితలంపై దింపేందుకు టీఐఐ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

వివరాలు 

సౌర కుటుంబం ఎలా ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నం

అంగారకుడు,గురుడు గ్రహాల మధ్య ఉన్న ప్రధాన గ్రహశకలాల వలయంలో జస్టిటియా ఉంటుంది.

దీని ప్రత్యేకమైన ఎరుపు రంగు శాస్త్రవేత్తల ఆసక్తిని పెంచుతోంది.నెప్ట్యూన్‌కు ఆవల ఉన్న కూయిపర్ బెల్ట్‌లో కనిపించే కొన్ని ఖగోళ వస్తువుల లక్షణాలు జస్టిటియాలోనూ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

దీంతో ఈ గ్రహశకలం తొలుత కూయిపర్ బెల్ట్‌లో ఏర్పడి, ఆ తర్వాత సౌర కుటుంబం లోపలి ప్రాంతంలోకి చేరి ఉండొచ్చని భావిస్తున్నారు.

జస్టిటియాను సమీపం నుంచి అధ్యయనం చేయడం ద్వారా సౌర కుటుంబం ప్రారంభ దశలో నీరు, సేంద్రీయ పదార్థాలు ఎలా పంపిణీ అయ్యాయనే అంశంపై కీలక సమాచారం లభించే అవకాశం ఉంది.

అలాగే గ్రహాలు ఏర్పడిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు దోహదపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రోబ్

యూఏఈ రాజధాని అబుదాబిలోని టీఐఐ పరిశోధకులు ఈ ప్రోబ్‌ను రూపొందించడంతో పాటు దానికి అవసరమైన పరీక్షలను కూడా నిర్వహించారు.

భూమి నుంచి లేదా ప్రధాన వ్యోమనౌక నుంచి నిరంతరం ఆదేశాలు అందాల్సిన అవసరం లేకుండా, పరిస్థితులకు అనుగుణంగా స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశారు.

ప్రోబ్‌లో అమర్చిన రెండు కెమెరాలు గ్రహశకలానికి సంబంధించిన చిత్రాలను వివిధ దూరాలు, స్థాయుల్లో నమోదు చేస్తాయి.

ఉపరితలానికి దగ్గరగా వెళ్లి ఫొటోలు తీయడంతో పాటు, అక్కడి పదార్థాల రసాయనిక కూర్పు, భౌతిక లక్షణాలను పరిశీలించేందుకు అవసరమైన విధంగా దీనిని రూపొందించారు.

ఈ సమాచారంతో జస్టిటియా స్వభావం, దాని ఆవిర్భావం గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగు

యూఏఈ చేపడుతున్న రెండో గ్రహాంతర అంతరిక్ష మిషన్‌గా ఈ ప్రాజెక్ట్ నిలవనుంది.

వ్యోమనౌక రూపకల్పన నుంచి నిర్మాణం, పరీక్షల వరకు దేశంలోనే చేపడుతున్న తొలి మిషన్ కావడం దీని ప్రత్యేకత.

అంతరిక్ష సాంకేతికతలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వయంగా అత్యాధునిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలనే యూఏఈ లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.

సౌర కుటుంబ ఆవిర్భావంపై కొత్త విషయాలను వెలికితీయడంతో పాటు, అంతరిక్ష పరిశోధనల్లో దేశ సామర్థ్యాన్ని మరింత పెంచే ప్రయత్నంగా దీనిని పరిశోధకులు చూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూఏఈ సరికొత్త అంతరిక్ష ప్రయోగం

ADVERTISEMENT