Loading...
Sumo Didi: అవమానాల నుంచి అంతర్జాతీయ విజయాల వరకు.. 'సుమో దీదీ' ట్రైలర్‌ అదిరిపోయింది!
అవమానాల నుంచి అంతర్జాతీయ విజయాల వరకు.. 'సుమో దీదీ' ట్రైలర్‌ అదిరిపోయింది!

Sumo Didi: అవమానాల నుంచి అంతర్జాతీయ విజయాల వరకు.. 'సుమో దీదీ' ట్రైలర్‌ అదిరిపోయింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆడపిల్ల శరీరం ఎలా ఉండాలి? ఆమె బరువు ఎంత ఉండాలి? ఏ రంగాల్లో రాణించాలి? అంటూ సమాజం విధించే హద్దులను ప్రశ్నిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది సరికొత్త స్పోర్ట్స్‌ డ్రామా 'సుమో దీదీ'. భారతదేశపు తొలి మహిళా సుమో రెజ్లర్‌ హేటల్‌ డేవ్‌ జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 హిందీ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహిళల బరువు, శరీరాకృతిని ఆధారంగా చేసుకుని సమాజం చేసే ఎగతాళి వారిలో ఎలాంటి మానసిక వేదనను కలిగిస్తుందో ట్రైలర్‌ ప్రారంభంలోనే చూపించారు.

వివరాలు

అవమానాలే ఆయుధాలుగా.. హేటల్‌ డేవ్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

సాంప్రదాయ మార్వాడీ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి.. తన రూపురేఖల కారణంగా ఎదుర్కొన్న అవమానాలు, అడ్డంకులను అధిగమించి ఎలా విజయం సాధించిందనే అంశాన్ని ఇందులో ప్రధానంగా ఆవిష్కరించారు.

బరువు ఎక్కువగా ఉందంటూ హేటల్‌ డేవ్‌ ఎదుర్కొన్న విమర్శలు, అవమానాలు ఆమె ప్రయాణంలో కీలకంగా నిలిచాయి. "బరువు తగ్గకపోతే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు?" అంటూ ఆమెను ప్రశ్నించే మాటలు సమాజంలో మహిళల శరీరాకృతిపై ఉన్న అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి.

మరోవైపు సుమో రెజ్లింగ్‌లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో స్పాన్సర్‌షిప్‌ల విషయంలోనూ ఆమె తిరస్కారాలను ఎదుర్కొంది.

అయినప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా తన లక్ష్యం దిశగా సాగింది.

వివరాలు

తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు

తన బలహీనతగా ఇతరులు భావించిన భారీ శరీరాకృతినే తన బలంగా మార్చుకుంది.

జపాన్‌కు ప్రత్యేకమైన సుమో రెజ్లింగ్‌ రింగ్‌లో భారత జెండాను రెపరెపలాడించిన హేటల్‌ డేవ్‌ నిజ జీవిత ప్రయాణాన్ని ఈ సినిమా తెరపైకి తీసుకొస్తోంది.

అవమానాలు, అడ్డంకులను అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆమె కథ ట్రైలర్‌లో భావోద్వేగభరితంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

జయంత్‌ రోహత్గి దర్శకత్వంలో 'సుమో దీదీ'

జియో స్టూడియోస్‌, ఫ్రెష్‌ లైమ్‌ ఫిల్మ్స్‌, MA+TH ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

జయంత్‌ రోహత్గి దర్శకత్వం వహించారు. హేటల్‌ డేవ్‌ పాత్రలో నటి శ్రియం భగ్నాని నటించగా, నటుడు చైతన్య శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని జపాన్‌, ముంబై, కోల్‌కతా ప్రాంతాల్లో చిత్రీకరించారు.

ఇప్పటికే టోక్యో, పామ్‌ స్ప్రింగ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ బయోపిక్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ADVERTISEMENT

వివరాలు

అక్టోబర్‌ 23 నుంచి జీ5లో స్ట్రీమింగ్

'సుమో దీదీ' చిత్రం 2026 అక్టోబర్‌ 23 నుంచి జీ5 హిందీ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

సమాజం నిర్ణయించిన హద్దులను దాటుకుని, తమ లక్ష్యాలను సాధించాలనుకునే వారికి హేటల్‌ డేవ్‌ జీవితం స్ఫూర్తినిచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు.

మహిళల శరీరాకృతి, బరువు ఆధారంగా వారిని అంచనా వేయడాన్ని ప్రశ్నిస్తూ.. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చనే సందేశాన్ని 'సుమో దీదీ' అందించనుంది.

నిజ జీవిత పోరాటాన్ని భావోద్వేగాలతో మేళవించిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT