Centre: ఆసుపత్రుల బిల్లులపై కేంద్రం కీలక ఆదేశాలు.. చార్జీల ప్రదర్శన తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు రోగులకు అందించే వైద్య సేవలకు సంబంధించిన చార్జీలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వైద్య సేవల్లో పారదర్శకతను పెంచడం, ఆసుపత్రుల జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, రోగులకు మెరుగైన సేవలు అందించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
వివరాలు
రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ ఈ అంశంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
ఆసుపత్రుల్లో వైద్య సేవల చార్జీలను ప్రదర్శించడానికి సంబంధించిన నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో సమీక్షించాలని సూచించారు.
రోగులు, వారి సహాయకులకు ధరల వివరాలు సులభంగా కనిపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
వివరాలు
చికిత్స ఖర్చులపై ముందే స్పష్టత
ఆసుపత్రులు చికిత్సకు సంబంధించిన ఖర్చులను పారదర్శకంగా ప్రదర్శిస్తే రోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యానికి ఎంత ఖర్చవుతుందనే విషయంపై ముందుగానే ఒక అంచనా వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది.
దీనివల్ల చికిత్స కోసం అవసరమైన ఆర్థిక ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది.
బిల్లుల విషయంలో రోగులు, ఆసుపత్రుల మధ్య తలెత్తే వివాదాలను తగ్గించడంతో పాటు వైద్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కూడా ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది.
వివరాలు
ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషలోనూ చార్జీలు
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం-2010, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) నిబంధనలు-2012 ప్రకారం.. ఈ చట్టం పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లోని వైద్య సంస్థలు తాము అందించే అన్ని వైద్య సేవలు, సౌకర్యాలకు సంబంధించిన చార్జీలను తప్పనిసరిగా ప్రదర్శించాలి.
ఈ ధరల వివరాలను ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషలోనూ అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
దీనివల్ల రోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవల ధరలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే
ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో ఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి గుర్తు చేశారు.
కేంద్ర చట్టం వర్తించని రాష్ట్రాలు సైతం తమ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో చార్జీల ప్రదర్శనను తప్పనిసరి చేయాలని సూచించారు.
వివరాలు
విదేశీ రోగుల ప్యాకేజీ ధరలపైనా దృష్టి
భారత్‌లో వైద్యం చేయించుకోవడానికి విదేశాల నుంచి వచ్చే రోగుల విషయంలోనూ ధరల పారదర్శకత పాటించాలని కేంద్రం కోరింది.
మెడికల్ లేదా ఆయుష్ వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు అందించే వైద్య ప్యాకేజీల ధరలను కూడా ప్రముఖంగా ప్రదర్శించేలా ఆసుపత్రులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.
ప్యాకేజీ ధరలు ముందుగానే అందుబాటులో ఉంటే విదేశీ రోగులు తమకు అనుకూలమైన వైద్య సేవలను ఎంచుకోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని కేంద్రం భావిస్తోంది.
ధరలకు సంబంధించి ఫిర్యాదులు తగ్గడంతో పాటు అంతర్జాతీయ వైద్య సేవల రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.