Meena Ganesh: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. నటి మీనా గణేష్ కన్నుమూత..
పాపులర్ మలయాళ నటి మీనా గణేష్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం ఒట్టప్పలంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 81 సంవత్సరాలు. ఆమె కొన్నాళ్లుగా ఒట్టపాలెంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ ఉదయం మరణించారు. మలయాళ సినీ పరిశ్రమలో 100కి పైగా సినిమాలు, 25 సీరియల్స్, అనేక నాటకాలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వాసంతి, లక్ష్మి, నామి, కారుమడికుట్టన్, నందనం, మీసామాధవన్ వంటి ప్రముఖ సినిమాల ద్వారా ఆమె మరింత ప్రసిద్దిగాంచారు.
మలయాళీ సంఘాల్లో నటన
మీనా గణేష్ 1942లో పాలక్కాడ్ జిల్లాలోని కల్లెకులంగరలో జన్మించారు. ఆమె తండ్రి, ప్రఖ్యాత తమిళ నటుడు కెపి కేశవన్ కుమార్తె. చిన్నప్పటి నుంచే నాటకాల్లో నటించడం వల్ల ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. కోయంబత్తూరు, ఈరోడ్, సేలంలోని మలయాళీ సంఘాల్లో నటిస్తూ మెప్పించారు. 1976లో మణిముజక్కం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. 1991లో విడుదలైన ముఖచిత్రం సినిమాతో ఆమె మరింత గుర్తింపు పొందింది. ఆ తరువాత ఆమెకు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి.
ఏఎన్ గణేష్‌తో వివాహం
1971లో, ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు మరియు నటుడు ఏఎన్ గణేష్‌తో వివాహం చేసుకున్న ఆమె, పౌర్ణమి కళామందిర్ అనే థియేటర్ కమిటీని ప్రారంభించారు. ఆమె కెరీర్‌లో మలయాళంలో 100కి పైగా సినిమాల్లో నటించి, ఎన్నో స్మరణీయమైన పాత్రలను పోషించారు. మీనా గణేష్ దంపతులకు కుమారుడు మనోజ్ గణేష్ సీరియల్స్ డైరెక్టర్, కూతురు సంగీత ఉన్నారు.