Loading...
Chiranjeevi: నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి.. పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!
నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి.. పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Chiranjeevi: నెట్‌ఫ్లిక్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి.. పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్రసీమలో దాదాపు 48 ఏళ్లుగా అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సరికొత్త బాటలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వెండితెరపై తన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి చిరంజీవి ఓ ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తొలుత చిరంజీవి జీవిత ప్రస్థానంపై ఓ డాక్యుమెంటరీని రూపొందించాలని భావించినట్లు సమాచారం. అయితే డాక్యుమెంటరీ కంటే పాడ్‌కాస్ట్ ద్వారా తన ఆలోచనలు, అనుభవాలు, భావాలను మరింత స్వేచ్ఛగా, నేరుగా ప్రేక్షకులతో పంచుకునే అవకాశం ఉంటుందని చిరంజీవి భావించినట్లు తెలుస్తోంది.

వివరాలు

అంగీకరించిన చిరంజీవి

ఈ వినూత్న ఆలోచనను ఆయన కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెలతో పాటు ప్రముఖ రచయిత బీవీఎస్ రవి ప్రతిపాదించగా.. చిరంజీవి వెంటనే అంగీకరించినట్లు సమాచారం.

ఇప్పటికే పలు విజయవంతమైన టాక్ షోలకు పనిచేసిన అనుభవం ఉన్న బీవీఎస్ రవి.. ఈ పాడ్‌కాస్ట్ సిరీస్‌కు రచన, రూపకల్పన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

సాధారణ ఇంటర్వ్యూల్లో ఇప్పటివరకు పంచుకోని ఎన్నో వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను చిరంజీవి ఈ కార్యక్రమం ద్వారా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల

అలాగే తన స్టార్‌డమ్ వెనుక ఉన్న శ్రమ, దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎదురైన ఎత్తుపల్లాలు, వృత్తిపరమైన అనుభవాలను కూడా ఈ పాడ్‌కాస్ట్ ద్వారా చిరంజీవి అభిమానులతో పంచుకోనున్నట్లు సమాచారం.

మెగాస్టార్ సినీ జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నేరుగా ఆయన మాటల్లోనే వినే అవకాశం అభిమానులకు లభించనుంది.

ఈ ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే విడుదల చేయనుందని తెలుస్తోంది.

ADVERTISEMENT