NAVADEEP : జీవితంపై నవదీప్ కీలక వ్యాఖ్యలు.. మనం ఎన్నో అనుకుంటాం గానీ అవన్నీ జరగవు
టాలీవుడ్ హీరో నవదీప్ 'లవ్ మౌళి చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన హీరోగా నటించిన మూవీని దర్శకుడు అవనీంద్ర తెరకెక్కించారు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సందర్బంగా నవదీప్ 'లవ్ మౌళి'గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. పంఖురి గిద్వానీ జోడిగా నవదీప్ ఆడిపాడనున్నారు. భావన సాగి, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదే సమయంలో ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నవదీప్ స్పందించారు. తాను గత కొన్నేళ్లలో రకరకాల సినిమాలు, అనవసరమైన చిత్రాలు చాలా చేశాన్నారు. లాక్‌డౌన్‌లో కొంత విరామం తీసుకుని తన బలం ఏమిటో తెలుసుకున్నానన్నారు.
జీవితంలో ఆగి ఆలోచిస్తేనే తెలుస్తుంది : నవదీప్
ఈ సినిమా ఆ కోవలోనే విన్న కథ అన్నారు. తన ఆలోచనా విధానానికి, తాను చేయాలనుకుంటున్న సినిమాలకు ఈ చిత్రం దగ్గరగా అనిపించిందని నవదీప్ చెప్పుకొచ్చారు. తన జీవితంలో జరిగిన ప్రేమ కథల ఫలితమే ఈ చిత్ర కథ సారాంశమని ఆయన అన్నారు. ప్రేక్షకుల ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నట్లు నవదీప్ వెల్లడించారు. జీవితంలో ఎన్నో చేయాలని అనుకుంటామని, కానీ జరిగేది వేరన్నారు. జీవిత పరుగులో నిగగ్నమైన మనం ఆ విషయాన్ని గమనించలేమన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఆగి ఆలోచిస్తే ఆ విషయం మనకు తెలుస్తుందన్నారు. మరోవైపు ఈ ప్రేమ కథలో చాలా కోణాలున్నాయి అని దర్శకుడు అవనీంద్ర చెప్పారు. కార్యక్రమంలో పంఖురి, అనంత్ శ్రీరామ్, భావన, కిరణ్ మామిడి తదితరులు పాల్గొన్నారు.