Loading...
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ సినిమాలు.. 'ఫౌజీ'తో 'స్పిరిట్‌'కూ షాక్!
వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ సినిమాలు.. 'ఫౌజీ'తో 'స్పిరిట్‌'కూ షాక్!

Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ సినిమాలు.. 'ఫౌజీ'తో 'స్పిరిట్‌'కూ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ సినిమాలు ప్రకటించిన సమయానికి విడుదలవుతాయా? అంటే అభిమానుల్లో ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా 'ఫౌజీ' విషయంలో జరుగుతున్న పరిణామాలు మరోసారి ఈ చర్చకు తెరలేపాయి. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాదికి వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ డేట్స్ కేటాయించడంలో ఆలస్యం కావడం, షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం వల్ల ఏడాదిలో ముగియాల్సిన సినిమాలు రెండేళ్లు, మూడేళ్ల సమయం తీసుకుంటున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 'ఫౌజీ' విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్లు సమాచారం.

వివరాలు

ఫౌజీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు

వాస్తవానికి అక్టోబర్ నాటికే 'ఫౌజీ' షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఇంకా కొంత భాగం చిత్రీకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్వెల్‌లో వచ్చే టెంపుల్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు క్లైమాక్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారట.

మొత్తంగా డిసెంబర్ చివరి నాటికి 'ఫౌజీ' షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

వివరాాలు

'ఫౌజీ' గ్లింప్స్‌ రిలీజ్ చేయడానికి ప్లాన్

ఇదిలా ఉంటే, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

అదే నిజమైతే ప్రభాస్ మరో చిత్రం 'స్పిరిట్' విడుదలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాకు మార్చి 5న విడుదల తేదీని ఖరారు చేశారు.

అదే రోజున సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

ఇప్పటికే 40శాతం పూర్తి

అయితే, ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజీ' షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉండటంతో 'స్పిరిట్'కు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ పరిస్థితుల్లో మార్చి 5న సినిమా విడుదల సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

'స్పిరిట్' షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ, ఇప్పటివరకు 40 శాతం చిత్రీకరణ మాత్రమే పూర్తయినట్లు సమాచారం.

ప్రస్తుతం 'ఫౌజీ'ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టిన ప్రభాస్.. ఆ సినిమా తర్వాత 'స్పిరిట్'కు డేట్స్ కేటాయించనున్నారట.

ఈ నేపథ్యంలో 2027 ద్వితీయార్థంలో షూటింగ్ పూర్తి చేయాలని సందీప్ రెడ్డి వంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

వచ్చే ఏడాది డిసెంబర్ కు విడుదల

అదే జరిగితే 'స్పిరిట్'ను వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి 'ఫౌజీ' వాయిదా వార్తలు ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతున్నాయి.

ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ప్రభాస్ గతంలో చెప్పిన మాటలు ఆచరణలో సాధ్యమవుతాయా? లేక షూటింగ్ ఆలస్యాలు, విడుదల తేదీల మార్పులు కొనసాగుతాయా? అనే చర్చ మొదలైంది. ప్రకటించిన తేదీకి ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటేనే నమ్మలేని పరిస్థితి అభిమానుల్లో ఏర్పడిందా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే, 'ఫౌజీ', 'స్పిరిట్' విడుదల తేదీలపై చిత్రబృందాల నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వివరాలను ప్రచారంలో ఉన్న సమాచారంగానే చూడాలి.

ADVERTISEMENT