హాలీవుడ్ మూవీ ఎప్పుడు ఉంటుందో చెప్పేసిన రాజమౌళి
ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి గుర్తింపు శిఖరాగ్రానికి చేరిపోయింది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడంతో ప్రపంచ సినిమాలో గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడు రాజమౌళి. ఇటీవల హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ని, స్టీవెన్ స్పీల్ బర్గ్ ని రాజమౌళి కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ దిగ్గజ దర్శకులు ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రశంసలన్నీ మోసుకొచ్చిన వార్తల ప్రకారం, హాలీవుడ్ లో రాజమౌళి సినిమా తీస్తాడనే సమాచారం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ వార్తలపై రాజమౌళి స్పందించాడు. హాలీవుడ్ లో సినిమా చేయాలనుకుంటున్నానని, ఎప్పుడో ఒకప్పుడు సినిమా ఉంటుందని, కానీ హాలీవుడ్ లో సినిమా తీయాలంటే ఒక సమస్య ఉందని అన్నాడు.
హాలీవుడ్ లో ఎలా మొదలెట్టాలో తెలీదంటున్న రాజమౌళి
ప్రతీ దర్శకుడికి హాలీవుడ్ సినిమా చేయాలనే కల ఉంటుందనీ, అది నెరవేరితే అంతకంటే సంతోషం ఉండదని, కానీ హాలీవుడ్ లో సినిమా చేయాలంటే ఎక్కడ మొదలెట్టాలో అర్థం కాదని అన్నాడు. ఇండియాలో ఐతే ఏది చెబితే అది తీసుకురావడానికి నిర్మాతలు రెడీగా ఉంటారని, హాలీవుడ్ లో చేయాలంటే ఇతరుల సాయం కావాల్సిందే అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఆల్రెడీ రాజమౌళికి హాలీవుడ్ ఏజెన్సీ సీఏఏ నుండి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి మాటలను బట్టి చూస్తుంటే ఈ ఏజెన్సీతో ఇండియన్ సినిమా తీసేలా ఉన్నాడని అర్థమవుతోంది. మరి అది మహేష్ బాబు సినిమానే అవుతుందా అనేది అనుమానంగా ఉంది. ఒకవేళ అదే జరిగితే తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచ వ్యాప్తమవుతుంది.