LOADING...
Rajendra prasad: ఎంజీఆర్‌పై కామెంట్స్ వివాదం.. సారీ చెప్పిన రాజేంద్రప్రసాద్
Rajendra prasad: ఎంజీఆర్‌పై కామెంట్స్ వివాదం.. సారీ చెప్పిన రాజేంద్రప్రసాద్

Rajendra prasad: ఎంజీఆర్‌పై కామెంట్స్ వివాదం.. సారీ చెప్పిన రాజేంద్రప్రసాద్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
08:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ గురించి తాను మాట్లాడిన మాటలు పొరపాటున వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని, అనుకోకుండా నోరుజారినట్టు విచారం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో రాజేంద్రప్రసాద్ ఎంజీఆర్ గురించి మాట్లాడారు. ఆ సందర్భంలో కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. దీంతో తమిళంలో మాట్లాడిన వీడియో ద్వారా ఆయన క్షమాపణలు తెలిపారు.

వివరాలు

అనుకోకుండా జరిగింది

వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఎంజీఆర్‌ను దేవుడిలా గౌరవిస్తానని చెప్పారు. కాంతారావు ప్రతిభను కొనియాడే క్రమంలో తాను అనుకోకుండా ఆ మాటలు చెప్పానని తెలిపారు. కొందరు ఈ విషయాన్ని పెద్దగా చూపించారని అన్నారు. "ఎంజీఆర్ లాంటి మహానుభావుడి గురించి నేను విమర్శించే స్థాయిలో ఉన్నానా?" అని ప్రశ్నించారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్న రోజుల్లో ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో వారు నటిస్తున్నప్పుడు వచ్చి ప్రోత్సహించేవారని రాజేంద్రప్రసాద్ గుర్తుచేశారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తాను తప్పుగా మాట్లాడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

వివరాలు

విశాల్, నాజర్ ఫైర్

తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే క్షమించాలని కోరుతూ, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. ఇక రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తమిళ సినీ ప్రముఖులు స్పందించారు. నటులు విశాల్, నాజర్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంజీఆర్ వంటి మహానుభావుడి గురించి తక్కువగా పోల్చుతూ మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసిందని వారు పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును బాధించాయని అన్నారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. దీంతో చివరికి రాజేంద్రప్రసాద్ ఎంజీఆర్ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

Advertisement