Renukaswamy Case: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అప్రూవర్‌గా మారిన సహ నిందితుడు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు బెంగళూరు కోర్టు అనుమతించింది. దీంతో ఇకపై ప్రదోష్‌ను నిందితుడిగా కాకుండా ప్రాసిక్యూషన్ తరఫున సాక్షిగా పరిగణించనున్నారు. బెంగళూరులోని 59వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (CCH) ప్రదోష్ దాఖలు చేసిన అప్రూవర్ పిటిషన్‌ను అంగీకరించింది.
వివరాలు
వాంగ్మూలాన్ని నమోదు చేయనున్న కోర్టు..
అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో హత్య కేసుకు సంబంధించిన అన్ని విషయాలను, తనకు తెలిసిన నిజాలను కోర్టు ముందు నిజాయితీగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రదోష్‌పై ఉంటుంది.
ఈ మేరకు కోర్టు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ప్రదోష్ కస్టడీలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.
అప్రూవర్‌గా మారిన తర్వాత ప్రదోష్‌కు కొన్ని షరతులతో ప్రయోజనాలు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.
అయితే అతడు నిజాలను వెల్లడించడంలో విఫలమైతే లేదా విధించిన షరతులను ఉల్లంఘిస్తే అప్రూవర్ హోదాను కోల్పోయే అవకాశం ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో మళ్లీ అతడిని నిందితుడిగా పరిగణించే అవకాశం కూడా ఉంటుంది.
వివరాలు
కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులు..
2024లో బెంగళూరులో రేణుకాస్వామి హత్య జరిగింది. దర్శన్‌కు అభిమాని అయిన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి పథకం ప్రకారం కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దర్శన్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పబడుతున్న పవిత్ర గౌడను ఉద్దేశించి రేణుకాస్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు.
వివరాలు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు..
ఇదిలా ఉంటే.. దర్శన్‌కు ఇటీవల కోర్టులో మరో షాక్ తగిలింది. విచారణ సమయంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించాలని దర్శన్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ముఖ్యంగా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో దర్శన్ ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం ఉందని ఆయన తరఫు న్యాయవాది హష్మత్ పాషా వాదించారు.
అయితే కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించలేదు. ఇకపై దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరచాలని ఆదేశించింది.