Shakti Kapoor: తన మరణంపై వస్తున్న వదంతులను ఖండించిన శక్తి కపూర్.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ హిందీ చిత్ర నటుడు శక్తి కపూర్(Shakti Kapoor)(73) తన మరణంపై సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నానని స్పష్టం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. "అందరికీ నమస్కారం. నా మరణంపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అసత్యం. నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. దయచేసి అలాంటి వార్తలను నమ్మవద్దు" అని ఆయన తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ అంశంపై సైబర్ నేర విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంటూ, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.
వివరాలు
హాస్యనటుడిగా సుమారు 700 చిత్రాలలో నటించిన శక్తీ కపూర్
ఈ వీడియోను చూసిన అభిమానులు ఉపశమనం పొందారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇక నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న తన సినీ ప్రస్థానంలో శక్తి కపూర్ ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా సుమారు 700కు పైగా చిత్రాలలో నటించి ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజా బాబు, అందాజ్ అప్నా అప్నా, హంగామా, మలమాల్ వీక్లీ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఆయన కెరీర్‌లో నిలిచాయి.