SHOBANA CHANDRAKUMAR: భరతనాట్యంలో దిట్ట.. శోభన చంద్రకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
శోభన పేరు వినగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఆమె నాట్య ప్రతిభే.
భరతనాట్యంలో నిష్ణాతురాలైన శోభన, వేదికలపైనే కాకుండా వెండితెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అందం, అభినయంలో ఆమెకు మరెవ్వరూ సాటిరారు. పలు భాషల్లో నటించి, అనేక దేశాల్లో తన నాట్య ప్రదర్శనల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్నారు.
భరతనాట్యంలో కీలకమైన అభినయ ప్రదర్శనలో శోభన అత్యున్నత స్థాయికి ఎదిగారు.
మరింత మంది కళాకారులను ప్రోత్సహించడానికి 1994లో ఆమె స్వయంగా 'కళార్పణ' అనే శిక్షణ సంస్థను ప్రారంభించారు.
నూతన తరానికి నాట్యంపై ఆసక్తి పెంచడమే ఆమె లక్ష్యం.
వివరాలు
బహు బాషలలో స్టార్ కథానాయికగా..
శోభన అసలు పేరు చంద్రకుమార్ పిళ్ళై. 1970, మార్చి 21న జన్మించిన ఆమె, చెన్నైలోని శిష్య స్కూల్‌లో చదువుకున్నారు.
సినీ పరిశ్రమలో ట్రావెన్‌కోర్ సిస్టర్స్‌గా పేరుపొందిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు శోభన.
సుకుమారి, అంబికా సుకుమారన్, వినీత్, కృష్ణ ఆమె సన్నిహిత బంధువులు.
చిన్నతనంలోనే శోభన చిత్ర విశ్వేశ్వరన్, పద్మ సుబ్రహ్మణ్యం దగ్గర నాట్య శిక్షణ తీసుకున్నారు.
మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన శోభన, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ వంటి అనేక భాషల్లో నటించి స్టార్ కథానాయికగా రాణించారు.
వివరాలు
న్యాయనిర్ణేతగా శోభనకు ప్రత్యేక గుర్తింపు
తెలుగులో ఆమె 'మువ్వగోపాలుడు', 'అజేయుడు', 'త్రిమూర్తులు', 'రుద్రవీణ', 'అభినందన', 'కోకిల', 'నేటి సిద్ధార్థ', 'నారీ నారీ నడుమ మురారి', 'రౌడీ అల్లుడు', 'అప్పుల అప్పారావు', 'రెండిళ్ల పూజారి', 'విక్రమ్', 'గ్యాంగ్‌వార్', 'రౌడీగారి టీచర్', 'అల్లుడుగారు', 'పాపకోసం', 'ముద్దుల మనవడు' వంటి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
2006లో మోహన్‌బాబు, విష్ణుతో కలిసి నటించిన 'గేమ్' చిత్రంలో కూడా ఆమె నటించారు.
మలయాళంలో ఆమె 'మణిచిత్రదళ', 'మిత్ర్ మై ఫ్రెండ్' చిత్రంలో నటనకు గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు.
టెలివిజన్ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా కూడా శోభన ప్రత్యేక గుర్తింపు పొందారు.
తమిళంలో 'పెన్' అనే సీరియల్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
వివరాలు
అమ్మాయిని దత్తత తీసుకున్న శోభన
ఆమె వివాహం చేసుకోలేదు, కానీ అనంత నారాయణి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
శోభన కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం 2006లో 'పద్మశ్రీ', 2014లో కేరళ ప్రభుత్వం 'కళా రత్న' పురస్కారాలతో గౌరవించింది.
2019లో డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
తనకు 'పద్మభూషణ్' పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, సెలక్షన్ కమిటీకి శోభన కృతజ్ఞతలు తెలియజేశారు.
తల్లిదండ్రులు, గురువుల ఆభారంతో పాటు, మిత్రులు, అభిమానుల మద్దతు లేకుండా ఈ గౌరవం సాధ్యమయ్యేది కాదని ఆమె అన్నారు.