G.V. Narayana: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినీ ప్రయాణంలో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది. 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంతులేని కథ' సినిమాతో జీవీ నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణ పొందిన ఆయనకు ప్రముఖ నటులు రజనీకాంత్,చిరంజీవితో మంచి స్నేహం ఉండేది.
వివరాలు
నటుడిగానే కాకుండా నిర్మాతగానూ..
'అంతులేని కథ', 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ', 'చిలకమ్మ చెప్పింది', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్' తదితర చిత్రాల్లో జీవీ నారాయణరావు కీలక పాత్రలు పోషించారు.
నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. 'దేవాంతకుడు', 'ఇంటికో రుద్రమ్మ', 'యముడికి మొగుడు', 'పెళ్లినీకు శుభం నాకు' వంటి చిత్రాలను నిర్మించారు.
వివరాలు
రంగస్థలంతో అనుబంధం..
కృష్ణాజిల్లా కురుమద్దాలి గ్రామంలో జీవీ నారాయణరావు జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది.
చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ప్రముఖుల వద్ద వివిధ కళల్లో శిక్షణ పొందారు.
గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు.
ఏ.ఆర్. కృష్ణ వద్ద నటనలో మెళకువలు అభ్యసించారు. చదువుకునే రోజుల్లోనే జీవీ నారాయణరావు రంగస్థలంపై అడుగుపెట్టారు.
'మహమ్మద్ బీన్ తుగ్లక్', 'ప్రతాపరుద్రీయం', 'మంచుతెర' తదితర నాటకాల్లో నటించారు.
ఆ సమయంలో ఆయనకు దివంగత నటులు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులతో స్నేహం ఏర్పడింది. వీరంతా ఆయనకు రంగస్థల మిత్రులుగా నిలిచారు.
వివరాలు
సినిమాలతో పాటు బుల్లితెరపైనా..
వెండితెరతో తన ప్రయాణాన్ని కొనసాగించిన జీవీ నారాయణరావు తర్వాత బుల్లితెరపైనా కనిపించారు.
పలు టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను అలరించారు.
నటుడిగా, నిర్మాతగా, రంగస్థల కళాకారుడిగా తెలుగు కళారంగంతో ఆయనకు ఉన్న అనుబంధం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
ఆయన మృతితో తెలుగు సినీ, రంగస్థల వర్గాల్లో విషాదం నెలకొంది.