Hyderabad: హైదరాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. 12 ఆయుధాలు మాయం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటన కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణంలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఆయుధాలు భద్రపరిచే గది తాళం పగులగొట్టి ఏకంగా 12 ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు సోమవారం బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రక్షణ వ్యవహారానికి సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో పోలీసులు దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
వివరాలు
ఆదివారం రాత్రి చోరీ
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో రక్షణ దళాల శిక్షణ సంస్థకు చెందిన పలు రెజిమెంట్‌లు ఉన్నాయి.
వాటిలో మద్రాస్ రెజిమెంట్ కూడా ఒకటి. ఈ రెజిమెంట్‌లో ఆర్మీ సిబ్బంది వినియోగించే ఆయుధాలను భద్రపరిచేందుకు ప్రత్యేక విభాగం ఉంది.
అనుమతి ఉన్న సిబ్బంది మినహా ఇతరులు ఆ విభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు.
ఇంతటి భద్రత ఉన్న ప్రాంతంలోనే ఆదివారం రాత్రి చోరీ జరగడం ఆర్మీ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.
వివరాలు
12 ఆయుధాలు మాయం
ఆయుధాల గది తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు.. నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆర్మీ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఆయుధాల గదిలోకి సాధారణంగా ఇతరులకు ప్రవేశం ఉండదని, అందువల్ల ఈ చోరీలో రెజిమెంట్‌కు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని వారు అనుమానిస్తున్నారు.
మద్రాస్ రెజిమెంట్ బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో ఆర్మీ అధికారులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులు ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
వివరాలు
ఒక్కరితో సాధ్యం కాదు
మద్రాస్ రెజిమెంట్ చుట్టూ నాలుగు ప్రధాన గేట్లు ఉన్నాయి.
ఆర్మీ అధికారులు, జవాన్లు, ముందస్తు అనుమతి ఉన్న వ్యక్తులు మినహా ఇతరులు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు.
ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయుధాల గదిలో చోరీ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చోరీకి గురైన ఆయుధాలను పరిశీలించిన పోలీసులు.. వాటి బరువు, పరిమాణం దృష్ట్యా ఒక్క వ్యక్తి వాటన్నింటినీ తీసుకెళ్లడం సాధ్యం కాదని భావిస్తున్నారు.
ఈ ఘటనలో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పాల్గొని ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
అంతేకాకుండా రెజిమెంట్‌లోని ఆయుధాల గది వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరుకున్నారంటే.. అక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు
రెజిమెంట్ సిబ్బందిని అంతర్గతంగా విచారిస్తున్న ఆర్మీ ఉన్నతాధికారులు
పోలీసు ఉన్నతాధికారులు మద్రాస్ రెజిమెంట్‌కు చేరుకుని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
రెజిమెంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
చోరీ జరిగిన సమయంలో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులు, వాహనాల వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఆర్మీ ఉన్నతాధికారులు కూడా రెజిమెంట్ సిబ్బందిని అంతర్గతంగా విచారిస్తున్నట్లు సమాచారం.
ఆయుధాల గది భద్రత, అక్కడికి ఎవరు ప్రవేశించారు, విధుల్లో ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.