Abhijeet Dipke: దీపావళి వరకు ఆందోళనలకు బ్రేక్.. అభిజీత్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దేశవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. దీపావళి పండగ వరకు దేశంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టబోమని స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలుస్తున్న యువత కుటుంబసభ్యులతో కలిసి పండగలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా యువత ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న యువత గురించి వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొంటున్న వారిపై కుటుంబసభ్యులు కలత చెందుతున్నారని తెలిపారు. తన కుటుంబం కూడా ఈ ఆందోళనలపై ఆందోళన చెందుతోందని ఆయన వెల్లడించారు.
వివరాలు
ఉచితంగా పబ్లిసిటీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు!
ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ కుటుంబాలు సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే దీపావళి వరకు నిరసన కార్యక్రమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకల సందర్భంగా ఈసారి వినూత్నంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు.
రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజీత్ దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల ఎత్తైన కాక్రోచ్ బొమ్మను సైతం కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వివరాలు
బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేస్తున్నాం
స్వచ్ఛ భారత్, స్వచ్ఛ దిల్లీ కార్యక్రమాల్లో భాగంగా మురికి, అపరిశుభ్రతకు చిహ్నంగా భావించే బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయనున్నట్లు రామ్‌లీలా కమిటీ వెల్లడించింది.
ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తమ పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
రామ్‌లీలా మైదానంలో కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం చేయాలనే నిర్ణయంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.