IIT Kanpur: స్టేజిపై మాట్లాడుతూ.. కన్నుమూసిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్
ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (55) ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. తొలుత ఖండేకర్‌కు విపరీతంగా చెమటలు వచ్చి.. తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి.. స్టేజిపై కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ప్రొఫెసర్లు, ఉద్యోగులు ప్రొఫెసర్‌ను ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. అయితే ఖండేకర్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఖండేకర్ 2019 నుంచి అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. విద్యార్థి వ్యవహారాల డీన్, ఐఐటీ కాన్పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా ఖండేకర్ ఉన్నారు. కుటుంబంతో కలిసి క్యాంపస్‌లోనే ఖండేకర్ నివసిస్తున్నారు.
ఖాండేకర్ మృతి పట్ల సంతాపం
ఖండేకర్ పూర్తిగా ఫిట్‌గా ఉండేవారని, ఆయన ఆకస్మిక మరణ వార్త విని షాక్‌కు గురయ్యారని ఇన్‌స్టిట్యూట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తెలిపారు. ఖాండేకర్ మృతి పట్ల మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్, ఐఐటీ కాన్పూర్ పలువురు సీనియర్ ప్రొఫెసర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఖండేకర్ నవంబర్10, 1971న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు. 2000లో ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ తీసుకుని ఇక్కడ నుంచి బీటెక్ పట్టా పొందారు. ఆ తర్వాత జర్మనీకి వెళ్లి 2004లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తిరిగి వచ్చిన తర్వాత ఐఐటీ కాన్పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.