Instagram: సీజేపీ నిరసనల తర్వాత.. ఇన్‌స్టాలో మోదీ, రాహుల్ గాంధీకి పెరిగిన క్రేజ్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల అనంతరం యువత,ముఖ్యంగా జెన్‌జీని ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా వీడియోలను షేర్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్లలో పాల్గొని,విద్యార్థులతో మాట్లాడిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం యువతతో నేరుగా మమేకమయ్యేందుకు ఆసక్తి చూపించారు. ఈ ప్రయత్నాల ప్రభావం ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టంగా కనిపించినట్లు 'డేటా బిగిన్స్' సంస్థ వెల్లడించిన నివేదికలు పేర్కొన్నాయి.
వివరాలు
మోదీ ఖాతాకు భారీగా పెరిగిన ఎంగేజ్‌మెంట్
సీజేపీ నిరసనలకు ముందు, జులై 20 తర్వాతి కాలానికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించిన సంస్థ.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీల ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్ రేట్లు భారీగా పెరిగినట్లు తెలిపింది.
నివేదిక ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎంగేజ్‌మెంట్ రేటు ఏకంగా 289.9శాతం పెరిగింది.
ఇందులో పోస్టులకు వచ్చిన వ్యూస్, లైక్స్, షేర్స్, కామెంట్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
మోదీ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 180.7శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచారు.
నిర్దిష్ట కాలంలో ఇద్దరు నేతలు వరుసగా వీడియోలు,ఇతర పోస్టులు షేర్ చేయడం వారి ఖాతాలపై ఆసక్తిని పెంచినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
మోదీ ఒక్కో పోస్టుకు 46.3 లక్షల ఎంగేజ్‌మెంట్
అదే సమయంలో మోదీ, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల వ్యూస్ కూడా పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ కాలంలో ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వీక్షించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఫలితంగా ఆయన ఒక్కో పోస్టుకు లభించే సగటు ఎంగేజ్‌మెంట్ 11.9 లక్షల నుంచి 46.3 లక్షలకు చేరింది.
అంటే గతంలో ఉన్న స్థాయితో పోలిస్తే దాదాపు 3.9 రెట్లు పెరిగింది.
వివరాలు
రాహుల్ ఖాతాకూ భారీ స్పందన
రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనూ ఇదే తరహా వృద్ధి నమోదైంది.
ఆయన పోస్టులకు లభించే సగటు ఎంగేజ్‌మెంట్ 1.52 లక్షల నుంచి 4.26 లక్షలకు పెరిగింది.
విద్యార్థులతో నేరుగా మాట్లాడటం, యువతకు సంబంధించిన అంశాలపై వీడియోలు, AMA సెషన్లు నిర్వహించడం వంటి చర్యలు సోషల్ మీడియాలో వారి ఖాతాలకు మరింత ఆదరణ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
యువతను చేరుకోవడంలో ఇన్‌స్టానే కీలకం
యువతను ఆకట్టుకోవడం, ముఖ్యంగా జెన్‌జీతో నేరుగా మమేకం కావడం, రాజకీయ అంశాలపై దృష్టిని ఆకర్షించడం కోసం ఇన్‌స్టాగ్రామ్ కీలక వేదికగా కొనసాగుతోంది.
సీజేపీ నిరసనల అనంతరం రాజకీయ నేతలు ఈ వేదికపై మరింత చురుగ్గా వ్యవహరించడం.. వారి సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ గణాంకాల్లోనూ ప్రతిబింబించినట్లు 'డేటా బిగిన్స్' నివేదికలు వెల్లడించాయి.