త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ
అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 నాటికి రామమందిరాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. త్రిపురలో ఎనిమిది రోజలు పాటు జరగనున్న బీజేపీ 'రథయాత్ర'ను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. త్రిపురలో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయ సాధిస్తుందన్నారు. మూడింట రెండొంతుల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఫిబ్రవరిలో త్రిపుర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బీజేపీ ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 'రథయాత్ర'ను చేపట్టింది.
లెఫ్ట్ ఫ్రంట్‌పై విమర్శనాస్త్రాలు
త్రిపురలో గతంలోని సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ పరిపాలన అంతా లెఫ్ట్ కేడర్ నియంత్రణలో ఉండేదని, ప్రతి అంశానికి ప్రజలు సీపీఎం నేతల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి.. 1,000 కి.మీ ప్రయాణించిన తర్వాత.. ఈ రథయాత్ర జనవరి 12న అగర్తలాలో ముగుస్తుంది. ఆ సమయంలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందిని నేరుగా కలవడానికి 'జన విశ్వాస యాత్ర' పేరుతో రథయాత్ర నిర్వహిస్తున్నట్లు త్రిపుర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ తెలిపారు