Andhra Pradesh: ఏపీలో విద్యుత్ అవసరాలకు భారీ ప్రణాళిక.. 2036 నాటికి 36 వేల మెగావాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2036 నాటికి రాష్ట్రానికి కనీసం 36 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ అవసరమవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెట్వర్క్ ద్వారా సుమారు 18 వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే అవకాశం ఉంది. రాబోయే పదేళ్లలో అదనంగా మరో 18 వేల మెగావాట్ల సరఫరా సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఇందుకోసం కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో పాటు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపడుతోంది.
వివరాలు
డేటా సెంటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఇటీవల విజయవాడలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ఎలక్ట్రిక్ పవర్ సర్వే సదస్సులో భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌పై అంచనాలతో కూడిన ప్రతిపాదనలను కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) అందించింది.
వీటికి అనుగుణంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నెట్వర్క్ విస్తరణకు ట్రాన్స్‌కో చర్యలు తీసుకుంటోంది.
విశాఖపట్టణంలో గూగుల్, రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కంట్రోల్ ఎస్ తదితర సంస్థలు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి.
వీటికి అవసరమైన విద్యుత్ సరఫరాపై ఆయా సంస్థలు ఇప్పటికే ట్రాన్స్‌కోకు ప్రతిపాదనలు అందించాయి.
గూగుల్ తన విద్యుత్ అవసరాల కోసం సొంతంగా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకుంటోంది.
వివరాలు
డేటా సెంటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
రిలయన్స్‌తో పాటు ఇతర సంస్థల నుంచి అందిన ప్రతిపాదనల ప్రకారం.. 2028 నాటికి కనీసం 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ట్రాన్స్‌కో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెట్వర్క్ విస్తరణ ప్రణాళికలను రూపొందించింది.
విశాఖలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ల నిర్వహణకు సుమారు 9.1 గిగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేస్తోంది.
భారీ విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది.
వివరాలు
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు విద్యుత్ సరఫరా
రాయలసీమలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా చేసేందుకు రూ.21,838 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) ప్రాజెక్టును ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే సుమారు 13 వేల మెగావాట్ల విద్యుత్‌ను తరలించగల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది.
దీనివల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగనుంది.
వివరాలు
ట్రాన్స్మిషన్ నెట్వర్క్ బలోపేతానికి చర్యలు
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను విస్తరించడంలో భాగంగా 23 ప్రాంతాల్లో కొత్తగా 400 కేవీ సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లను అభివృద్ధి చేస్తోంది.
మరో 55 ప్రాంతాల్లో 220 కేవీ, 132కేవీ సబ్స్టేషన్లు,విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తోంది.
ప్రస్తుతం ట్రాన్స్‌కో పరిధిలో సుమారు 33,200సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ సరఫరా లైన్లు ఉన్నాయి.
అలాగే 400 కేవీ, 220 కేవీ, 132కేవీ సామర్థ్యాల సబ్స్టేషన్లు కలిపి మొత్తం 385అందుబాటులో ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు పలు ప్రాంతాల్లో కొత్త లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
బొబ్బిలి-గరివిడి మధ్య ఉన్న 400 కేవీ విద్యుత్ లైన్‌కు అనుసంధానంగా,విజయనగరం జిల్లా మరడాం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేసేలా కొత్త లైన్‌ను నిర్మిస్తోంది.
వివరాలు
ట్రాన్స్మిషన్ నెట్వర్క్ బలోపేతానికి చర్యలు
పెందుర్తి, మరడాం, అచ్యుతాపురం, పలాస, పద్మనాభం, మాకవరపాలెం ప్రాంతాల్లో నెట్వర్క్ అనుసంధానం కోసం కొత్త విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.
దీనివల్ల ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు వీలవుతుందని భావిస్తోంది.
వివరాలు
కాకినాడ ఎస్ఈజడ్ నుంచి పలు సబ్స్టేషన్లకు అనుసంధానం
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజడ్)లో కొత్త సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలంలోని కల్పక, అచ్యుతాపురం, రాంబిల్లి సబ్స్టేషన్లతో దాన్ని అనుసంధానించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది.
కాకినాడ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ఇప్పటికే సుమారు 30 శాతం పూర్తయ్యాయి.
అచ్యుతాపురంలో నిర్మిస్తున్న 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయి.
మాకవరపాలెంలో కొత్తగా 765 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లిలో నిర్మాణంలో ఉన్న 400 కేవీ సబ్‌స్టేషన్ పనులు సుమారు 84 శాతం పూర్తయ్యాయి.
ఈ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థకు మరింత సామర్థ్యం చేకూరనుంది.
వివరాలు
పద్మనాభం వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్ ప్రతిపాదన
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) పెందుర్తిలో 765 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తోంది.
ఒడిశాలోని అంగుల్తో పాటు శ్రీకాకుళం, వేమగిరి సబ్స్టేషన్లను అనుసంధానించేలా విద్యుత్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.
ఈ అనుసంధాన వ్యవస్థకు మద్దతుగా పద్మనాభం సమీపంలో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని ట్రాన్స్‌కో భావిస్తోంది.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరగడం, విశాఖలో భారీ డేటా సెంటర్ల ఏర్పాటు, వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక అవసరాలు విస్తరించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌కో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తోంది.
ప్రతిపాదిత సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.