Loading...
AP Municipal Election: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. 123 పట్టణ స్థానాల్లో కీలక మార్పులు
123 పట్టణ స్థానాల్లో కీలక మార్పులు

AP Municipal Election: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. 123 పట్టణ స్థానాల్లో కీలక మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో మేయర్‌ పదవులు, 106 పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్‌ పదవులకు ఏయే వర్గాలకు అవకాశం కల్పించారో పురపాలకశాఖ సోమవారం గెజిట్‌ విడుదల చేసింది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 41, ఎస్సీలకు 16, ఎస్టీలకు నాలుగు పదవులు కేటాయించారు. మిగిలిన స్థానాల్లో జనరల్‌ మహిళలకు, అన్‌రిజర్వ్‌డ్‌ వర్గాలకు అవకాశం కల్పించారు. మొత్తంగా సగం స్థానాల్లో మహిళలు మేయర్లు,ఛైర్‌పర్సన్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలను కూడా ప్రకటించారు. కర్నూలు,రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు ఎస్సీ వర్గానికి కేటాయించగా,మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎస్టీ వర్గానికి దక్కింది.

వివరాలు 

శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో మహిళలకే ఎక్కువ అవకాశాలు

మహా విశాఖపట్నంతో పాటు గుంటూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం నగరపాలక సంస్థల్లో మహిళలు మేయర్లుగా ఎన్నికయ్యే అవకాశం లభించింది.

శ్రీకాకుళం జిల్లాలోని మూడు పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్‌ పదవులూ మహిళలకే దక్కాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో రెండింటిని బీసీ మహిళలకు కేటాయించారు.

అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్‌ పదవులు మహిళలకే దక్కాయి. బాపట్ల జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో రెండింటిని మహిళలకు కేటాయించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు పురపాలక సంఘాలు ఉండగా, నాలుగు చోట్ల మహిళలు ఛైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో ఐదు మహిళలకు కేటాయించారు.

వివరాలు 

కాకినాడ నగరపాలక సంస్థలో మహిళా మేయర్లు.. 

కర్నూలు జిల్లాలో మూడు పురపాలక సంఘాలకు గాను రెండింటిలో మహిళలకు అవకాశం లభించింది.

తూర్పు గోదావరి జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో రెండింటిని మహిళలకు కేటాయించారు. విజయనగరం జిల్లాలోని మూడు పురపాలక సంఘాలూ మహిళలకే దక్కాయి.

కాకినాడ నగరపాలక సంస్థలో గతంలోనూ మహిళలు మేయర్లుగా బాధ్యతలు చేపట్టారు.

2005 ఎన్నికల్లో బీసీ మహిళ మేయర్‌గా ఎన్నికవగా, 2017 ఎన్నికల్లో జనరల్‌ మహిళకు అవకాశం లభించింది.

ఈసారి కాకినాడ మేయర్‌ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. కాకినాడ జిల్లాలోని పురపాలక సంఘాల్లో మూడు ఎస్సీ వర్గానికి దక్కాయి.

బాపట్ల జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో రెండింటిని ఎస్సీలకు కేటాయించారు. ప్రకాశం జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలూ జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు 

జిల్లాల వారీగా పురపాలక సంఘాల రిజర్వేషన్లు

పల్నాడు జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో నాలుగు జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

రాష్ట్రంలోని 106 పురపాలక సంఘాల్లో ఎస్టీ జనరల్‌కు రెండు, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఏడు, ఎస్సీ మహిళకు ఏడు, బీసీ జనరల్‌కు 18, బీసీ మహిళకు 18, జనరల్‌ మహిళలకు 27, జనరల్‌ అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీకి 26 ఛైర్‌పర్సన్‌ పదవులు కేటాయించారు.

శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం పురపాలక సంఘం బీసీ మహిళకు, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస పురపాలక సంఘాలు జనరల్‌ మహిళలకు కేటాయించారు.

విజయనగరం జిల్లా: రాజాం బీసీ మహిళకు, నెల్లిమర్ల బీసీ జనరల్‌కు, బొబ్బిలి జనరల్‌ మహిళకు కేటాయించారు.

పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం జనరల్‌ మహిళకు, సాలూరు, పాలకొండ బీసీ మహిళలకు కేటాయించారు.

ADVERTISEMENT

వివరాలు 

జిల్లాల వారీగా పురపాలక సంఘాల రిజర్వేషన్లు

అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం బీసీ మహిళకు, యలమంచిలి జనరల్‌ మహిళకు కేటాయించారు.

తూర్పు గోదావరి జిల్లా: నిడదవోలు ఎస్సీ మహిళకు, కొవ్వూరు జనరల్‌ మహిళకు, మండపేట జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

కాకినాడ జిల్లా: ఏలేశ్వరం ఎస్సీ మహిళకు, సామర్లకోట, పిఠాపురం ఎస్సీ జనరల్‌కు, తుని బీసీ మహిళకు కేటాయించారు. గొల్లప్రోలు, పెద్దాపురం జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా: ముమ్మిడివరం బీసీ మహిళకు, రామచంద్రపురం బీసీ జనరల్‌కు, అమలాపురం జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

ఏలూరు జిల్లా: చింతలపూడి ఎస్సీ మహిళకు, నూజివీడు ఎస్సీ జనరల్‌కు, జంగారెడ్డిగూడెం బీసీ మహిళకు కేటాయించారు.

వివరాలు 

జిల్లాల వారీగా పురపాలక సంఘాల రిజర్వేషన్లు

పశ్చిమ గోదావరి జిల్లా: పాలకొల్లు బీసీ మహిళకు, నరసాపురం, ఆకివీడు, భీమవరం జనరల్‌ మహిళలకు కేటాయించారు. తణుకు, తాడేపల్లిగూడెం జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

కృష్ణా జిల్లా: ఉయ్యూరు ఎస్సీ జనరల్‌కు, గుడివాడ బీసీ మహిళకు, తాడిగడప బీసీ జనరల్‌కు, పెడన జనరల్‌ మహిళకు కేటాయించారు.

ఎన్టీఆర్‌ జిల్లా: కొండపల్లి ఎస్సీ మహిళకు, తిరువూరు బీసీ జనరల్‌కు, జగ్గయ్యపేట జనరల్‌ మహిళకు కేటాయించారు. నందిగామ జనరల్‌ కేటగిరీలోకి వచ్చింది.

గుంటూరు జిల్లా: పొన్నూరు జనరల్‌ మహిళకు, తెనాలి జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల, సత్తెనపల్లి బీసీ జనరల్‌కు, చిలకలూరిపేట, మాచర్ల జనరల్‌ మహిళలకు కేటాయించారు. గురజాల, దాచేపల్లి, వినుకొండ, నరసరావుపేట జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

వివరాలు 

జిల్లాల వారీగా పురపాలక సంఘాల రిజర్వేషన్లు

బాపట్ల జిల్లా: చీరాల ఎస్సీ మహిళకు, బాపట్ల ఎస్సీ జనరల్‌కు, రేపల్లె జనరల్‌ మహిళకు కేటాయించారు.

ప్రకాశం జిల్లా: కందుకూరు, చీమకుర్తి, అద్దంకి, దర్శి పురపాలక సంఘాలన్నీ జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

మార్కాపురం జిల్లా: పొదిలి ఎస్సీ జనరల్‌కు, కనిగిరి జనరల్‌ మహిళకు కేటాయించారు. గిద్దలూరు, మార్కాపురం జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

నెల్లూరు జిల్లా: గూడూరు ఎస్టీ మహిళకు, అల్లూరు ఎస్టీ జనరల్‌కు, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు జనరల్‌ మహిళలకు కేటాయించారు. కావలి జనరల్‌ కేటగిరీలోకి వచ్చింది.

తిరుపతి జిల్లా: సూళ్లూరుపేట ఎస్సీ మహిళకు, పుత్తూరు, శ్రీకాళహస్తి బీసీ జనరల్‌కు, వెంకటగిరి, నాయుడుపేట జనరల్‌ మహిళలకు కేటాయించారు.

వివరాలు 

జిల్లాల వారీగా పురపాలక సంఘాల రిజర్వేషన్లు

చిత్తూరు జిల్లా: కుప్పం ఎస్సీ జనరల్‌కు, పుంగనూరు బీసీ మహిళకు, పలమనేరు జనరల్‌ మహిళకు కేటాయించారు. నగరి జనరల్‌ కేటగిరీలోకి వచ్చింది.

అన్నమయ్య జిల్లా: మదనపల్లె, రాయచోటి, బి.కొత్తకోట పురపాలక సంఘాలన్నీ బీసీ జనరల్‌కు కేటాయించారు.

వైఎస్సార్‌ కడప జిల్లా: ఎర్రగుంట్ల, రాజంపేట బీసీ మహిళలకు, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల జనరల్‌ మహిళలకు కేటాయించారు. ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

అనంతపురం జిల్లా: గుత్తి ఎస్సీ మహిళకు, గుంతకల్లు బీసీ మహిళకు, తాడిపత్రి బీసీ జనరల్‌కు, కళ్యాణదుర్గం జనరల్‌ మహిళకు కేటాయించారు. రాయదుర్గం జనరల్‌ కేటగిరీలోకి వచ్చింది.

శ్రీసత్యసాయి జిల్లా: కదిరి బీసీ మహిళకు, హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, పెనుకొండ బీసీ జనరల్‌కు కేటాయించారు. ధర్మవరం జనరల్‌ కేటగిరీలోకి వచ్చింది.

వివరాలు 

ఈ జిల్లాల్లో బీసీలకు ఎక్కువ అవకాశాలు

నంద్యాల జిల్లా: ఆత్మకూరు ఎస్టీ జనరల్‌కు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు బీసీ మహిళలకు, బేతంచెర్ల, నంద్యాల బీసీ జనరల్‌కు కేటాయించారు. డోన్‌ జనరల్‌ మహిళకు కేటాయించారు.

కర్నూలు జిల్లా: గూడూరు బీసీ మహిళకు, ఆదోని జనరల్‌ మహిళకు, ఎమ్మిగనూరు జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, బి.కొత్తకోట పురపాలక సంఘాలన్నింటినీ బీసీ జనరల్‌ కేటగిరీకి కేటాయించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లోనూ మహిళలే ఛైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

శ్రీసత్యసాయి జిల్లాలో ఆరు పురపాలక సంఘాలు ఉండగా, ఐదు చోట్ల బీసీలకు అవకాశం లభించింది. ధర్మవరం మాత్రం అన్‌రిజర్వ్‌డ్‌గా నిర్ణయించారు.

నంద్యాల జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో నాలుగు చోట్ల బీసీలు ఛైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

వివరాలు 

17 నగరపాలక సంస్థల్లో మేయర్‌ పదవుల రిజర్వేషన్లు

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో రెండింటిని బీసీలకు కేటాయించారు.

రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల మేయర్‌ పదవులకు కూడా రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరపాలక సంస్థల్లో జనరల్‌ మహిళలకు అవకాశం కల్పించారు.

రాజమహేంద్రవరం ఎస్సీ జనరల్‌కు, కాకినాడ బీసీ మహిళకు, ఏలూరు బీసీ జనరల్‌కు కేటాయించారు.

మచిలీపట్నం బీసీ మహిళకు, మంగళగిరి-తాడేపల్లి ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.

గుంటూరు జనరల్‌ మహిళకు దక్కగా, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి నగరపాలక సంస్థలు జనరల్‌ కేటగిరీలోకి వచ్చాయి.

చిత్తూరు, అనంతపురం బీసీ జనరల్‌కు, కడప జనరల్‌ మహిళకు, కర్నూలు ఎస్సీ మహిళకు కేటాయించారు.

వివరాలు 

17 నగరపాలక సంస్థల్లో మేయర్‌ పదవుల రిజర్వేషన్లు

మొత్తం 17 మేయర్‌ పదవుల్లో ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ మహిళలకు రెండు, బీసీ జనరల్‌కు మూడు, జనరల్‌ మహిళలకు ఐదు, జనరల్‌ అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీకి నాలుగు పదవులు కేటాయించారు.

ఈ రిజర్వేషన్లతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ సామాజిక వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు, బీసీలకు ప్రాతినిధ్యం లభించనుంది.

ADVERTISEMENT