LOADING...
Agri University: బీఎస్సీ వ్యవసాయ పరీక్షల్లో లీకేజీ కలకలం.. ఉన్నతాధికారి సహా నలుగురు సస్పెండ్
ఉన్నతాధికారి సహా నలుగురు సస్పెండ్

Agri University: బీఎస్సీ వ్యవసాయ పరీక్షల్లో లీకేజీ కలకలం.. ఉన్నతాధికారి సహా నలుగురు సస్పెండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో వరంగల్‌ కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన ఘటన బయటపడింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ఒక ఉన్నతాధికారితో పాటు మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లీకేజీ ద్వారా 35 మంది ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు అందినట్లు గుర్తించారు. వీరంతా వ్యవసాయ విస్తరణాధికారులుగా పనిచేస్తూ, ఇన్‌సర్వీస్‌ కోటాలో మూడేళ్ల క్రితం బీఎస్సీ (వ్యవసాయ)లో చేరారు. అయితే,వారి ప్రవేశాలను రద్దు చేస్తూ, తిరిగి వ్యవసాయ శాఖకు పంపించాలని యూనివర్సిటీ నిర్ణయించింది. అలాగే, భవిష్యత్తులో మళ్లీ ఇన్‌సర్వీస్‌ కోటాలో బీఎస్సీ ప్రవేశాలు పొందకుండా బ్లాక్‌లిస్టులో చేర్చారు.

వివరాలు 

వ్యవహారం ఇలా వెలుగులోకి వచ్చింది… 

గత వారం యూనివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గత నెల నిర్వహించిన సెమిస్టర్‌ పరీక్షల మార్కుల షీట్లను ఆయన పరిశీలించారు. అందులో ఇన్‌సర్వీస్‌ విద్యార్థులు అత్యంత కఠినమైన పాథాలజీ సబ్జెక్టులో 90 శాతానికి పైగా మార్కులు సాధించినట్లు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. సాధారణంగా ఈ సబ్జెక్టులో అత్యంత ప్రతిభావంతులకే 60 శాతానికి మించి మార్కులు రావడం కష్టమనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలోని సీసీటీవీ ఫుటేజీలను తెప్పించి పరిశీలించగా, ఒక ఇన్‌సర్వీస్‌ అభ్యర్థి కేవలం పది నిమిషాల్లోనే పరీక్ష పూర్తి చేసి ఖాళీగా కూర్చున్నట్లు గుర్తించారు.

వివరాలు 

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పెన్నులో ప్రశ్నలకు సమాధానాలు 

ఆ విద్యార్థిని పిలిచి విచారించగా, వరంగల్‌ నుంచి వాట్సప్‌ ద్వారా ప్రశ్నపత్రం అందిందని వెల్లడించాడు. పార్ట్‌-ఏలోని 40 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానాలను కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పెన్నులో నమోదు చేసుకుని పరీక్ష రాసినట్లు చెప్పాడు. ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్న వీసీ జానయ్య, ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. విచారణలో మొత్తం వ్యవహారం బయటపడింది. వరంగల్‌ వ్యవసాయ కళాశాలకు చెందిన ఒక అధికారి, ఒక ఉద్యోగి కలిసి ఆరు పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు పంపినట్లు తేలింది. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు.

Advertisement

వివరాలు 

పరీక్షల నిర్వహణలో లోపాలపై సైబర్‌ నేరాల విభాగం ద్వారా సమగ్ర విచారణ

ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న 35 మంది ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు చేరాయి. వారంతా ఏఐ ఆధారిత పెన్నుల సహాయంతో సమాధానాలు నమోదు చేసి పరీక్షలు రాసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ లీకేజీ ఘటన నేపథ్యంలో, ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణలో లోపాలపై సైబర్‌ నేరాల విభాగం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని వీసీ జానయ్య నిర్ణయించారు.

Advertisement