Regional Passport Office: విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు.. జనవరిలో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త ఆఫీస్‍లో 2024 జనవరి నుంచి సేవలు అందుబాటులో రానున్నాయి. గవర్నర్‌పేటలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ ఏర్పాటు చేయబోయే ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ద్వారా అనేక రకాలైన సేవలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని 15 జిల్లాలకు పాస్‌పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్, అడ్మినిస్ట్రేషన్, పాలసీతో పాటు సహా అనేక రకాల సేవలు ఈ కార్యాలయం ద్వారా అందుబాటులోకి వస్తాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (RPO) శివ హర్ష కర్రా తెలిపారు. ఆర్‌పీఓ కోసం విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్(ఏజీ) కార్యాలయ ఆవరణలో విదేశాంగ శాఖ ఒక అంతస్తును కేటాయించిందని శివ హర్ష తెలిపారు.
పాస్‌పోర్టుల జారీ సమయం తగ్గుతుంది: ఆర్‌పీఓ
విజయవాడలో పాస్‌పోర్ట్ కార్యాలయం అందుబాటులోకి రావడంతో పాస్‌పోర్టుల జారీ సమయం తగ్గుతుందని శివ హర్ష వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పాస్‌పోర్ట్ ప్రింటింగ్, డిస్పాచ్, పరిపాలన, పోలీసు సంబంధిత సేవలను అందిస్తోంది. పోలీస్ క్లియరెన్స్ పొందిన 15 రోజుల్లోనే పాస్‌పోర్టులు జారీ చేస్తున్నామని ఆర్పీఓ తెలిపారు. విజయవాడలో ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమైతే, జారీ వ్యవధి మరింత తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లోగా పాస్‌పోర్టులు జారీ అవుతాయన్నారు. దరఖాస్తుదారులు తమ పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించవచ్చని వెల్లడించారు. కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభమైనప్పటికీ విజయవాడలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం పనిచేస్తుందని శివ హర్ష స్పష్టం చేశారు.