LOADING...
Revanth reddy: తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్‌తో కీలక చర్చలు
తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్‌తో కీలక చర్చలు

Revanth reddy: తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్‌తో కీలక చర్చలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పెట్టుబడులు విస్తరించడంతో పాటు ఉన్నత విద్యా రంగంలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు భారత్‌లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలో ఉన్న బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ-కెనడా మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అలాగే ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కెనడా పర్యటనకు రావాలని హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ అధికారిక ఆహ్వానం అందజేశారు.

వివరాలు

మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు..

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక అభివృద్ధి కార్యక్రమాల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను కూడా సమావేశంలో సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్-500 సంస్థల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్‌ను తమ కార్యకలాపాల కేంద్రంగా ఎంపిక చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇదే అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

Advertisement