'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ
'భారత్ జోడో యాత్ర'లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాసిన లేఖపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శాలను జారీ చేసింది. అయితే కరోనా నిబంధనల మేరకే రాహుల్ కి లేఖ పంపినట్లు బీజేపీ చెబుతుండగా.. భారత్ జోడో యాత్ర'కు వస్తున్న ప్రజాదరణను చూసి కాషాయపార్టీ ఓర్వలేక పోతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర బుధవారం హర్యానాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాహల్ పాదయాత్రకు వస్తున్న ప్రజలను చూసి.. ప్రధాని మోదీ భయపడుతున్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు.
'రాజకీయ ఉద్దేశంతోనే లేఖ రాశారు'
రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'కు ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే మాండవీయ లేఖ రాసినట్లు కనిపిస్తోందని సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు. ఇది ప్రజల కోసం రాసిన లేఖలా లేదని, బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాసిన ఉత్తరంగా ఉందని విమర్శించారు. రెండు రోజులు క్రితం త్రిపురలో మోదీ ర్యాలీల్లో ఎలాంటి కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించలేదన్నారు. రెండో వేవ్ సమయంలో కూడా, పశ్చిమ బెంగాల్‌లో ప్రధానమంత్రి పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించినట్లు గెహ్లోత్ గుర్తు చేశారు. ఈ లేఖలో ఆరోగ్యమంత్రి రాజకీయ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మాండవీయ ఒకవేళ రాస్తే.. మొదట ప్రధాని మోదీకి రాసి.. ఆ తర్వాత రాహుల్‌కు రాయాల్సిందని ఎద్దేవా చేశారు. మంగళవారం వరకు రాహుల్ యాత్ర రాజస్థాన్‌లోనే సాగింది.