LOADING...
VB GRAMG: వీబీ జీరామ్‌జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం
వీబీ జీరామ్‌జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం

VB GRAMG: వీబీ జీరామ్‌జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మనరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (VB-G RAM G Act) నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టంతో ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిన కేంద్రం, తాజాగా అమలులో ఉండే రోజువారీ వేతనాలను కూడా నోటిఫై చేసింది. కొత్త నిబంధనల ప్రకారం రోజువారీ కూలీని కనిష్ఠంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.409 వరకు నిర్ణయించారు. అయితే సిక్కింలోని కొన్ని ప్రత్యేక పంచాయతీల్లో రోజుకు రూ.450 చొప్పున వేతనం చెల్లించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వివరాలు 

పలు రాష్ట్రాల్లో 15 శాతానికి పైగా వేతనాల పెంపు

అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో గత ఉపాధి హామీ పథకంతో పోలిస్తే కొత్త చట్టం కింద రోజువారీ వేతనాలు 15 శాతానికి పైగా పెరిగాయి. అయితే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం వేతనాల పెంపు 3 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

వివరాలు 

21 రాష్ట్రాల్లో రోజుకు రూ.300 వేతనం

వీబీ జీరామ్‌జీ పథకం కింద 21 రాష్ట్రాల్లో రోజువారీ వేతనాన్ని రూ.300గా కేంద్రం నిర్ణయించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో రోజువారీ కూలీ రూ.308గా నిర్ణయించగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312, మహారాష్ట్రలో రూ.317గా ఖరారు చేశారు. దాద్రా నగర్‌ హవేలీ, దమన్‌ అండ్‌ దీవ్‌లో రూ.340, తమిళనాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ.347 చొప్పున చెల్లించనున్నారు. అలాగే కర్ణాటకలో రోజుకు రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406 చొప్పున రోజువారీ వేతనం అందించనున్నారు. సిక్కింలోని మూడు ప్రత్యేక పంచాయతీలకు మాత్రం అత్యధికంగా రూ.450 రోజువారీ కూలీ చెల్లించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Advertisement

వివరాలు 

కొత్త చట్టంతో వేతనాల సవరణ

2026-27 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం కింద వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించలేదు. వీబీ జీరామ్‌జీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉండటంతో వేతనాల పెంపును అప్పట్లో వాయిదా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి రావడంతో తాజా వేతనాలను ప్రకటించింది. అంతకుముందు చివరిసారిగా గత ఏడాది మార్చి 27న కేంద్రం ఉపాధి హామీ కూలీల వేతనాలను సవరించింది.

Advertisement