Rajasthan Bus Accident: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర విషాదం.. మంటల్లో దగ్ధమైన బస్సు.. ఏడుగురు మృతి, 22 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ రహదారిపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే బస్సును మంటలు చుట్టుముట్టాయి. ఏం జరిగిందో గ్రహించేలోపే కొందరు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై అధిక వేగంతో వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు ముందుగా వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లగా, వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు.
వివరాలు
ముందుగా వెళ్తున్న ట్రక్కును వేగంగా ఢీకొన్న బస్సు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 39 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనావడ సమీపానికి చేరుకున్న సమయంలో, ముందుగా వెళ్తున్న ట్రక్కును బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సు లోయలోకి పడిన వెంటనే వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు మొత్తం బస్సును ఆవరించాయి. ఇదే సమయంలో ట్రక్కుకు కూడా మంటలు వ్యాపించడంతో ప్రమాద స్థలం భయానకంగా మారింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపించినప్పటికీ, మంటల తీవ్రత కారణంగా వెంటనే సహాయం చేయడం సాధ్యం కాలేదు.
వివరాలు
క్షతగాత్రులకు దౌసా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స
ఈ ప్రమాదంలో బస్సులో మంటలు వ్యాపించడంతో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ముగ్గురికి తలకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఏడుగురు మృతి చెందగా, మరో 22 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రుల్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు రెస్క్యూ చర్యలు ప్రారంభించాయి. బస్సు లోయలో పడిన వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు మంటలు వ్యాపించేలోపే బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. మరికొందరిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.గాయపడిన 22 మందిని దౌసా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
గ్రీన్ కారిడార్ ఏర్పాటు
క్షతగాత్రులను వేగంగా ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గురైన బస్సు ఇండోర్‌కు చెందిన హన్స్ ట్రావెల్స్ సంస్థకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ట్రక్కును ఢీకొనడం వల్లే బస్సు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంటల్లో దగ్ధమవుతున్న బస్సు
In Dausa, Rajasthan, a bus traveling from #Rishikesh to #Indore collided with a truck and caught fire. So far, 7 passengers have died in the accident, and more than 20 people have been reported injured. There were a total of 39 passengers on the bus. Relief and rescue operations…
— Siraj Noorani (@sirajnoorani) July 1, 2026