Quick Commerce: పండగల వేళ 'క్విక్' కొలువులు.. 3 లక్షల కొత్త గిగ్ ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రిటెయిల్ రంగ స్వరూపాన్ని క్విక్ కామర్స్ వేగంగా మార్చేస్తోంది. నిమిషాల్లోనే సరుకులు ఇంటికి చేరే విధానం నగరాలు, పట్టణాల్లో కొత్త అలవాటుగా మారింది. ప్రస్తుతం దేశంలో క్విక్ కామర్స్ మార్కెట్ విలువ సుమారు రూ.95,500 కోట్లకు చేరినట్లు అంచనా. ఈ నేపథ్యంలో రాబోయే సుదీర్ఘ పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రంగంలో భారీగా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 35-40 శాతం అదనపు నియామకాలు జరిగే అవకాశం ఉందని, దాదాపు 3 లక్షల కొత్త గిగ్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
తాత్కాలిక నియామకాలు 20 శాతం వరకు పెరగొచ్చు
ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్‌లీజ్ విడుదల చేసిన 'ఫెస్టివ్ సీజన్ వర్క్‌ఫోర్స్-2026' నివేదిక ప్రకారం.. పండగల సమయంలో తాత్కాలిక నియామకాలు 20 శాతం వరకు పెరగొచ్చు.
ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే తాత్కాలిక నియామకాల్లో క్విక్ కామర్స్ వాటా దాదాపు 60 శాతంగా ఉండనుంది.
ఈ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా గిగ్ వర్కర్లుగా సేవలందించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.
వివరాలు
పోటీతో కంపెనీల దూకుడు
దేశీయ క్విక్ కామర్స్ మార్కెట్లో వాటా కోసం ప్రధాన కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. ప్రస్తుతం విక్రయాల్లో బ్లింకిట్ 46శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది.
జొమాటో మద్దతుతో ఉన్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఇప్పటికే 408నగరాలకు విస్తరించింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 24 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉండగా.. 22 శాతం వాటాతో జెప్టో గట్టి పోటీ ఇస్తోంది.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్ 5-7 శాతం వాటాను కలిగి ఉంది.
మరోవైపు అమెజాన్ నౌ, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాల ప్రవేశంతో పోటీ మరింత తీవ్రమైంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ప్రతి నెలా సగటున 100 డార్క్ స్టోర్లను ప్రారంభిస్తూ ప్రత్యర్థి సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది.
వివరాలు
డార్క్ స్టోర్ల విస్తరణ
వేగవంతమైన డెలివరీలు అందించేందుకు కంపెనీలు ఏర్పాటు చేస్తున్న చిన్న గిడ్డంగులైన డార్క్ స్టోర్ల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది.
2026 జులై నాటికి ఐదు ప్రధాన సంస్థల పరిధిలో దేశవ్యాప్తంగా 5,625 డార్క్ స్టోర్లు అందుబాటులోకి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వీటిలో బ్లింకిట్ 1,955 కేంద్రాలతో అగ్రస్థానంలో ఉంది.
మెట్రో నగరాల్లో అద్దెలు, నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండటంతో క్విక్ కామర్స్ సంస్థలు రెండు, మూడో శ్రేణి నగరాలపై దృష్టి సారిస్తున్నాయి. అక్కడ మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నాయి.
వివరాలు
మారుతున్న నియామకాల విధానం
ఈసారి క్విక్ కామర్స్ కంపెనీల నియామక ధోరణిలోనూ గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
పెద్ద సంఖ్యలో సాధారణ డెలివరీ సిబ్బందిని నియమించుకోవడం కంటే.. నిర్దిష్ట నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను ఎంపిక చేసుకునే విధానానికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
తాత్కాలిక నియామకాల్లో మెట్రో నగరాల వాటా గతేడాది 38.2 శాతంగా ఉండగా.. ఈసారి 40.5 శాతానికి పెరుగుతుందని అంచనా. ఈ రంగంలో పనిచేస్తున్న సిబ్బంది సగటు వయసు కూడా 28.2 ఏళ్ల నుంచి 26.7 ఏళ్లకు తగ్గింది.
మొత్తం ఉద్యోగుల్లో పురుషుల వాటా 85 శాతం కాగా.. మహిళల వాటా 15 శాతంగా ఉంది.
వివరాలు
గిగ్ వర్కర్లకు సవాళ్లు
మరోవైపు క్షేత్రస్థాయిలో డెలివరీ భాగస్వాములు ఎదుర్కొంటున్న సమస్యలు సంస్థలకు సవాలుగా మారుతున్నాయి.
ఒక్క డెలివరీకి చెల్లించే మొత్తం గతంలో రూ.35 వరకు ఉండగా.. ప్రస్తుతం అది రూ.10-15కు పడిపోయింది.
దీనికి తోడు ఇంధన ధరల పెరుగుదల, సామాజిక భద్రత లేకపోవడం గిగ్ కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
ఇదే సమయంలో సంప్రదాయ కిరాణా దుకాణాలు తమకు ఉన్న దశాబ్దాల నాటి వ్యక్తిగత సంబంధాలు, వినియోగదారుల నమ్మకం, అప్పు సౌకర్యం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని పోటీని ఎదుర్కొంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ద్వారా డిజిటల్ వేదికల్లోకి అడుగుపెట్టి క్విక్ కామర్స్ సంస్థలకు సవాలు విసురుతున్నాయి.