Earthquake: ఇండోనేసియా తీరంలో భారీ భూకంపం.. 47 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేసియా తీరానికి సమీపంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలకు 47 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భూకంప ధాటికి పలు భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. సహాయక చర్యలతోపాటు శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భూకంపం అనంతరం తొలుత సునామీ హెచ్చరిక జారీ చేశారు. అయితే పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆ హెచ్చరికను ఉపసంహరించారు. తొలి ప్రకంపన తర్వాత 235 చిన్నపాటి ప్రకంపనలు కూడా సంభవించినట్లు ఇండోనేసియా వాతావరణ, భూభౌతిక సంస్థలు వెల్లడించాయి.
వివరాలు
నార్త్ సుమత్రలో మరో భారీ భూకంపం
అమెరికా జియలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకారం.. భూకంప కేంద్రం ఈస్ట్ నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఎండె నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 10 కిలోమీటర్ల లోతున ఉంది.
శనివారం సాయంత్రం నార్త్ సుమత్ర ప్రావిన్స్‌లోనూ మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
అయితే ఈ భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 172.5 కిలోమీటర్ల లోతులో ఉండటంతో నష్టం తీవ్రత తక్కువగా ఉన్నట్లు సమాచారం.
పలు ద్వీపాల సముదాయంగా ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. దేశం భౌగోళికంగా భూకంపాలకు అధికంగా గురయ్యే ప్రాంతంలో ఉండటంతో ఇలాంటి ప్రకంపనలు తరచూ చోటుచేసుకుంటాయి.