Nobel Prize: 2026 నోబెల్ పురస్కారాల ప్రకటన షురూ.. వైద్యశాస్త్రంలో ముగ్గురికి అవార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
2026 ఏడాదికి సంబంధించిన నోబెల్ పురస్కారాల ప్రకటనలు (The Nobel Prize 2026) సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. కాంతి నియంత్రిత అయాన్ ఛానల్స్, ఆప్టోజెనెటిక్స్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ కార్ల్ డిసెరోథ్, పీటర్ హెగెమన్, జార్జ్ నగెల్‌లకు ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇక నోబెల్ పురస్కారాల ప్రకటనలు వరుసగా కొనసాగనున్నాయి. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లను వెల్లడించనున్నారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటిస్తారు. అక్టోబర్ 12న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకునే వారి పేర్లను వెల్లడించనున్నారు.
వివరాలు
నాలుగు స్వతంత్ర సంస్థల ద్వారా ఎంపిక
నోబెల్ పురస్కారం కింద అందించే నగదు బహుమతి విలువ 12 లక్షల డాలర్లు, అంటే సుమారు రూ.11.5 కోట్లుగా ఉంది.
నోబెల్ ఫౌండేషన్ (Nobel Foundation) ఆధ్వర్యంలో స్వీడన్, నార్వే దేశాలకు చెందిన నాలుగు వేర్వేరు స్వతంత్ర సంస్థలు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను నోబెల్ పురస్కారాలకు ఎంపిక చేస్తాయి. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాలను అందిస్తున్నారు.
1901 నుంచి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.