Stock market: సెన్సెక్స్ 472 పాయింట్లు జంప్.. వరుస నష్టాలకు బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా వరుస నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. సోమవారం పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కొంత తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు కాస్త తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. దీంతో సూచీలు రోజంతా ఎక్కువగా లాభాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ ఉదయం 72,340.95 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. గత సెషన్‌లో ఇది 71,909.70 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 472.77 పాయింట్లు పెరిగి 72,382.47 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా లాభాల్లో ముగిసింది.
వివరాలు
లాభపడ్డ, నష్టపోయిన షేర్లు
సోమవారం సూచీ 133.80 పాయింట్లు పెరిగి 22,555.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక విదేశీ మారక మార్కెట్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.29గా నమోదైంది.
సెన్సెక్స్-30లోని పలు కీలక షేర్లు సోమవారం లాభాలను నమోదు చేశాయి.
ఐటీసీ, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
మరోవైపు హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
క్రూడాయిల్, బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 102.43డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ధర కూడా గణనీయ స్థాయిలో ఉంది. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్స్ ధర 4,157.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.