Flydubai: విమానాన్ని కూల్చే కుట్ర.. నేరాన్ని ఒప్పుకున్న ఫ్లైదుబాయ్ కోపైలట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్లైదుబాయ్ (Flydubai) విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించాడని అనుమానిస్తున్న కో పైలట్ హమామ్ అల్-హమ్మామీ (Hamam al-Hammami) తన నేరాన్ని అంగీకరించాడు. విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. పథకం ప్రకారమే కెప్టెన్ స్మిత్ మచ్చర్ దృష్టిని మళ్లించి, అనంతరం అతడిపై దాడి చేసినట్లు హమ్మామీ పేర్కొన్నాడు. తనకు మరణమంటే భయం లేదని కూడా విచారణలో వ్యాఖ్యానించాడు. అయితే ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయాన్ని మాత్రం అతడు వెల్లడించలేదు. హమ్మామీకి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో లేదా ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు చెందిన దర్యాప్తు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి.
వివరాలు
దర్యాప్తు కొనసాగుతుంది
హమ్మామీ యూఏఈలో జన్మించాడు. అతడి తండ్రి ఒమన్ జాతీయుడు కాగా.. తల్లి సిరియా జాతీయురాలు. ఫ్లైదుబాయ్‌లో చేరకముందు హమ్మామీ ఒమన్, సిరియా, మొరాకోల్లోనూ గడిపాడు. సిరియాలో సుదీర్ఘకాలం కొనసాగిన అంతర్యుద్ధ సమయంలో అతడు అక్కడే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆ సమయంలోనే అతడు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన దర్యాప్తు అధికారులు.. అందులో వేల సంఖ్యలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టులు, సందేశాలు ఉన్నట్లు గుర్తించారు.
హమ్మామీకి ఉన్న సంబంధాలు, కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలతో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.