Irani Cup 2026: పంత్ కెప్టెన్సీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జోరు.. ఇరానీ కప్ కైవసం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా (RoI) నిలిచింది. ఫైనల్‌లో జమ్ము కశ్మీర్‌పై 167 పరుగుల తేడాతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జమ్ముకశ్మీర్ జట్టు కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ 8 వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ 6 వికెట్లు, ముకేశ్ చౌదరి 6 వికెట్లు పడగొట్టి జమ్ము కశ్మీర్ బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేశారు.
వివరాలు
తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడినా.. కప్పు రెస్ట్ ఆఫ్ ఇండియాదే
తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా 237 పరుగులు చేసింది. అనంతరం జమ్ము కశ్మీర్ 278 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించింది.
దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియా కొంత వెనుకబడినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తా చాటింది. రిషభ్ పంత్ నేతృత్వంలోని రెస్ట్ ఆఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది.
దీంతో జమ్ము కశ్మీర్ ముందు 269 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో జమ్ము కశ్మీర్ విఫలమై 111 పరుగులకే ఆలౌటైంది.
ఫలితంగా రెస్ట్ ఆఫ్ ఇండియా 167 పరుగుల తేడాతో విజయం సాధించి ఇరానీ కప్‌ను ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో స్మరణ్ రవిచంద్రన్ (68, 135) అద్భుతంగా రాణించాడు.
వివరాలు
రెండో ఇన్నింగ్స్‌లో ఆ తప్పులు చేయలేదు: పంత్
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక పరుగులు చేసిన అతడిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. గత రెండు సార్లు ఇరానీ ట్రోఫీని ముంబయి, విదర్భ జట్లు గెలుచుకున్నాయి.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ''మ్యాచ్ గెలిచాక.. అప్పటి వరకూ మనం పడిన బాధలు, కష్టాలు మరిచిపోతాం. తొలి ఇన్నింగ్స్ నుంచి మేం ఫుల్లర్ డెలివరీలతో ఇబ్బంది పెట్టాలని చూశాం. కానీ, అలా చేయలేకపోయాం.
రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గత పొరపాట్ల నుంచి నేర్చుకున్నాం. మా బౌలర్లు అద్భుతం చేశారు. బ్యాటింగ్‌లో స్మరణ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు'' అని పంత్ వెల్లడించాడు.