Rahul Gandhi: 'సత్యాగ్రహ' ప్రారంభించిన రాహుల్ గాంధీ.. దేశవ్యాప్త నిరసనలకు ఒకే వేదిక!
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ' (Satyagraha) పేరుతో డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు, హక్కుల కోసం వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న నిరసనలు, పోరాటాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ డిజిటల్ వేదిక లక్ష్యమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఎక్కడైనా నిరసన కొనసాగుతున్నా.. దాని వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో సత్యాన్ని అణిచివేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సత్యం అణచివేతకు గురవుతున్న చోట ప్రజలకు అండగా నిలవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని పేర్కొన్నారు.
వివరాలు
'ప్రజలు ఒంటరిగానే పోరాడుతున్నారు'
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే 'సత్యాగ్రహ' ఉద్దేశమని వివరించారు.
'దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే, వారంతా ఒంటరిగానే పోరాడుతున్నారు. జెన్‌జీ (Gen Z), విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటాల (Protests) వెనుక ఓ కారణం ఉంటుంది.
ఒంటరిగా పోరాడుతున్నందు వల్ల వారి గళాన్ని అణచివేయడం సులభమవుతోంది. ఆ గళాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ 'సత్యాగ్రహ''' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ.. సత్యమే తమ గొప్ప ఆయుధమని బాపూజీ బోధించారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, సత్యం పక్షాన కలిసి నిలబడటం అంతకంటే గొప్ప ఆయుధమని పేర్కొన్నారు.
వివరాలు
'మీ పోరాటం గురించి చెప్పండి'
మీరు కూడా ఏదైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మీ కథనాన్ని పంచుకోండి. పార్లమెంటు అయినా, వీధులు అయినా.. ఎక్కడైనా సరే. మీ సమస్యలు పరిష్కరించేందుకు, మీకు అండగా నిలిచేందుకు నా శక్తిమేర కృషి చేస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా అది నా బాధ్యత అని రాహుల్ గాంధీ అన్నారు.
తమ 'సత్యాగ్రహ' కథనాన్ని తనకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
అలా చేస్తే దేశవ్యాప్తంగా ప్రజలు వారి పోరాటాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఇతర ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలపై పోరాడుతున్నవారితో అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు.
పోర్టల్‌లో తమ పేరు, గ్రూపు పేరు, నిరసనకు సంబంధించిన వివరాలను నమోదు చేయవచ్చని ఆయన వివరించారు.