Loading...
Bond Yields: బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగితే భారత్‌ మార్కెట్లపై ప్రభావం ఎలా ఉంటుంది?
బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగితే భారత్‌ మార్కెట్లపై ప్రభావం ఎలా ఉంటుంది?

Bond Yields: బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగితే భారత్‌ మార్కెట్లపై ప్రభావం ఎలా ఉంటుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలు ఇప్పటికే దేశీయ స్టాక్‌ మార్కెట్లను ఒత్తిడిలోకి నెట్టాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో కీలక అంశం చేరింది. అదే అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ (Bond Yields). అగ్రరాజ్యంలో బాండ్లపై రాబడులు గణనీయంగా పెరగడం భారత మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఇంతకీ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ ఎందుకు పెరుగుతున్నాయి? వాటి ప్రభావం మన స్టాక్‌ మార్కెట్లపై ఎందుకు పడుతోంది?

వివరాలు 

ఎనిమిది వారాల్లో భారీ నష్టం

ఈఏడాది ఫిబ్రవరి నుంచి పశ్చిమాసియా పరిణామాలు,ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్ల సూచీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

తాజాగా అమెరికా బాండ్లపై పెరుగుతున్న రాబడులు ఈఒత్తిడిని మరింత తీవ్రం చేస్తున్నాయి.

గత ఎనిమిది వారాల వ్యవధిలో సెన్సెక్స్‌ ఏకంగా 6,590పాయింట్లు కోల్పోయింది.

నిఫ్టీ 2,149పాయింట్లు దిగజారింది.దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా మదుపర్ల సంపదలో దాదాపు రూ.26లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

అమెరికా 10ఏళ్ల కాలపరిమితి ఉన్న ట్రెజరీ బాండ్లపై రాబడులు 2007 తర్వాత తొలిసారిగా 5.31శాతానికి చేరాయి.

మరోవైపు 30ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్‌ 5.65శాతానికి పెరిగింది.

ఇది 2002 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి.ఈ పరిణామాలే ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి.

వివరాలు 

బాండ్‌ ఈల్డ్స్‌ ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రభుత్వాలు భారీగా నిధులు సమీకరించాల్సిన అవసరం ఉన్నప్పుడు బాండ్లను జారీ చేస్తాయి.

సులభంగా చెప్పాలంటే.. బాండ్‌ అనేది ప్రభుత్వం లేదా సంస్థ తీసుకున్న అప్పుకు సంబంధించిన హామీ పత్రం.

బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి బదులుగా ప్రజలు,సంస్థాగత మదుపర్ల నుంచి నేరుగా నిధులు సమీకరించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు.

అమెరికా ప్రభుత్వం వివిధ కాలపరిమితులతో బాండ్లను జారీ చేస్తుంది.

వీటినే యూఎస్‌ ట్రెజరీ బాండ్లు అంటారు. వీటిపై మదుపర్లు పొందే రాబడిని 'బాండ్‌ ఈల్డ్‌'గా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

బాండ్‌ ఈల్డ్స్‌ ఎందుకు పెరుగుతున్నాయి?

మరోవైపు క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను ఎక్కువ కాలం గరిష్ఠ స్థాయుల్లోనే కొనసాగించాల్సి రావచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.

ఫలితంగా అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ఇదొక్కటే కారణం కాదు. అమెరికా ప్రభుత్వం భారీ స్థాయిలో రుణాలు సమీకరిస్తోంది.

అదే సమయంలో టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేధ (AI)పై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన మూలధనం కోసం మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు పోటీ పడుతున్నాయి.

ఈ పరిణామాలు కూడా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌ మార్కెట్లపై ప్రభావం ఎందుకు?

సాధారణంగా బాండ్లపై రాబడులు పెరిగినప్పుడు ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతుంది.

దీనికి ప్రధాన కారణం మదుపర్ల పెట్టుబడి నిర్ణయాల్లో వచ్చే మార్పులు. బాండ్‌ రాబడులు తగ్గిన సమయంలో పెట్టుబడిదారులు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ మార్కెట్ల వైపు నిధులను మళ్లించే అవకాశం ఉంటుంది.

అయితే అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు ఆకర్షణీయంగా మారితే పరిస్థితి మారుతుంది.

భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లతో పోలిస్తే అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం విదేశీ మదుపర్లకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు.

వివరాలు 

భారత్‌ మార్కెట్లపై ప్రభావం ఎందుకు?

దీంతో అధిక రిస్క్‌ ఉన్న భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే.. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై మెరుగైన రాబడి లభిస్తే, ఎక్కువ రిస్క్‌ ఉన్న పెట్టుబడుల్లోకి వెళ్లేందుకు మనం అంతగా ఆసక్తి చూపించం.

విదేశీ మదుపర్ల విషయంలోనూ ఇదే తరహా నిర్ణయం కనిపిస్తుంది.

అమెరికా బాండ్లలో ఆకర్షణీయమైన రాబడి లభిస్తే.. భారత్‌ వంటి మార్కెట్లలో పెట్టుబడులపై ఉన్న రిస్క్‌ను వారు పరిగణనలోకి తీసుకుంటారు.

వివరాలు 

రూపాయి పతనం కూడా మరో కారణం

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కూడా విదేశీ మదుపర్లకు ప్రతికూలంగా మారుతోంది.

రూపాయి బలహీనపడితే భారత్‌లో పెట్టిన పెట్టుబడుల నుంచి లభించే రాబడిని డాలర్లలోకి మార్చినప్పుడు విలువ తగ్గే అవకాశం ఉంటుంది.

దీంతో ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీల్లో అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే దేశీయ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) విక్రయాలు భారీగా కొనసాగుతున్నాయి.

ఈ ఒక్క వారంలోనే వారు దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు.

అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌, వడ్డీ రేట్ల అంచనాలు, క్రూడాయిల్‌ ధరలు, రూపాయి కదలికలు.. ఇవన్నీ కలసి ప్రస్తుతం భారత స్టాక్‌ మార్కెట్‌ దిశపై ప్రభావం చూపిస్తున్నాయి.

ADVERTISEMENT