Jammu-Srinagar Vande Bharat : చెనాబ్,అంజి వంతెనలపై 100 కిమీ వేగంతో దూసుకెళ్లిన జమ్మూ-శ్రీనగర్ వందేభారత్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూ-శ్రీనగర్ వందేభారత్ రైలు మరో కీలక ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా పేరున్న చెనాబ్ వంతెనపై తొలిసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. అంతేకాదు,భారత్‌లో తొలి కేబుల్-స్టేడ్ రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందిన అంజి వంతెనపైనా అదే వేగంతో దూసుకెళ్లింది. దీంతో జమ్ముకశ్మీర్ రైలు ప్రయాణంలో మరో కీలక ముందడుగు పడింది. చెనాబ్ రైల్వే బ్రిడ్జి నదీ మట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇది పారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. చెనాబ్ నదిపై 1,315 మీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ భారీ స్టీల్ ఆర్చ్ వంతెనను కఠినమైన భౌగోళిక పరిస్థితులు, తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకునేలా నిర్మించారు.
వివరాలు
అంజి వంతెనపైనా వందేభారత్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఈ వంతెనకు 120 ఏళ్ల జీవితకాలాన్ని నిర్దేశించారు.
ఇక అంజి వంతెనపైనా వందేభారత్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL)లో ఇది మరో కీలక నిర్మాణం.
చెనాబ్‌కు దక్షిణంగా ఉన్న లోతైన అంజి నది లోయపై ఈ వంతెన నిర్మించారు.
కత్రా-బనిహాల్ రైలు మార్గాన్ని అనుసంధానించే ఈ వంతెన జమ్మూ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అంజి వంతెన నదీ మట్టానికి 331 మీటర్ల ఎత్తులో, లోయపై 725 మీటర్ల పొడవున విస్తరించింది.
దీనికి 96 హై-టెన్సైల్ కేబుళ్లు ఆధారంగా ఉన్నాయి.
వివరాలు
వంతెన నిర్మాణంలో మొత్తం 653కిలోమీటర్ల కేబుల్ స్ట్రాండ్లు
వంతెనకు ప్రధానంగా నిలిచే ఇన్వర్టెడ్ 'Y' ఆకారపు పైలాన్ పునాది నుంచి 193 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు.
ఈ వంతెన నిర్మాణంలో మొత్తం 653కిలోమీటర్ల కేబుల్ స్ట్రాండ్లను ఉపయోగించారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 26401/26404 రైళ్లతో ఈ వేగ పరీక్షను నిర్వహించారు.
అక్టోబర్ 2న జరిగిన ఈ పరీక్షలో భాగంగా 111 కిలోమీటర్ల పొడవైన శ్రీమాతా వైష్ణోదేవి కత్రా-బనిహాల్ మార్గంలో గరిష్ఠ అనుమతించదగిన వేగాన్ని గంటకు 75కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెంచారు.
ఈ వేగం పెంపుతో కత్రా-బనిహాల్ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశం ఉంది.
జమ్మూ ప్రాంతాన్ని కశ్మీర్ లోయతో కలిపే USBRL ప్రాజెక్టులో ఈ మార్గం కీలక భాగం.
వివరాలు
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 'ఎక్స్'లో పోస్టు
ఈ పరిణామంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 'ఎక్స్'లో పోస్టు చేశారు. జమ్మూ-కశ్మీర్ రైల్వే నెట్‌వర్క్‌కు ఇది చారిత్రాత్మక రోజని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం 266 కిలోమీటర్ల రైలు మార్గంలో రెండు జతల వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
తొలుత ఈ రైళ్లను ఎనిమిది కోచ్‌లతో ప్రారంభించారు. ప్రయాణికుల నుంచి పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ప్రారంభంలో మరో 16 కోచ్‌లను జోడించారు.
దీంతో ఒక్కో రైలులో మొత్తం కోచ్‌ల సంఖ్య 20కి చేరింది.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారైన ఈ కశ్మీర్ వందేభారత్ రైళ్లు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లోనూ నడిచేలా రూపొందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అశ్వినీ వైష్ణవ్ చేసిన ట్వీట్
100 km/h over India’s engineering pride! 🇮🇳 pic.twitter.com/4GlR5QJTva
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 2, 2026